Simbaa Review: ‘సింబా’ రివ్యూ..జగపతిబాబు, అనసూయ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ ఎలా ఉందంటే?

Simbaa Review: ‘సింబా’ రివ్యూ..జగపతిబాబు, అనసూయ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ ఎలా ఉందంటే?

విలక్షణ నటుడు జగపతి బాబు(Jagapathi Babu), అనసూయ (Anasuya Bharadwaj)  ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సింబా’ (Simbaa). ద ఫారెస్ట్ మ్యాన్ అనేది ట్యాగ్‌‌‌‌లైన్. మురళీ మనోహర్ రెడ్డి దర్శకుడు. డైరెక్టర్ సంపత్ నంది కథను అందిస్తూ, రాజేందర్‌‌‌‌‌‌‌‌ రెడ్డితో కలిసి నిర్మించారు. ఫారెస్ట్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం (ఆగస్ట్ 9న) థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రకృతి ప్రేమికుడిగా కనిపించిన జగపతిబాబు భావితరాలకు ఎలాంటి సందేశం ఇచ్చాడో రివ్యూలో తెలుసుకుందాం. 

కథేంటంటే::

అక్షిక (అన‌సూయ‌) ఒక స్కూల్ టీచర్. తన భర్తకు యాక్సిడెంట్ లో కాళ్ళు పోవడంతో తనే ఇంటిని పోషిస్తుంది. ఇలా ఒకరోజు అనసూయ  రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటుంది. ఆ క్రమంలో తన మైండ్ లో ఏదో రన్ అవుతూ ఉంటుంది. ఇక అదే సమయంలో హైద‌రాబాద్ న‌గ‌రంలో అక్షిక ఉండే ప్లేస్లో ఓ దారుణ  హ‌త్య చోటు చేసుకుంటుంది. ఆ హత్యను ఛేదించడానికి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తుటారు. ఈ మర్డర్ కేసుని పోలీసాఫీసర్ అనురాగ్(వశిష్ఠ సింహ), జర్నలిస్ట్ ఫాజిల్(శ్రీనాథ్) హత్యకు సంబంధించిన వివరాలు సేకరిస్తూ ఉంటారు.

ఒక రోజు సరదాగా ఫ్యామిలీతో అక్ష ఒక షాపింగ్ చేయడానికి వస్తుంది. అదే టైంలో ఫాజిల్ కూడా తన లవర్ ఇష్ట(దివి)తో ఆ ప్లేస్కి వస్తాడు. పోలిసు అనురాగ్ కూడా కేసు విచారణ కోసం ఆ ప్లేస్కి వస్తారు. ఇలా వీరందరూ ఒకే ప్లేస్ లో ఉండగానే అక్కడ మరో వ్యక్తి మర్డర్ చేయబడతాడు. ఇక అక్కడున్న అక్షికను, జర్నలిస్ట్ ఫాజిల్ ను అనుమానంతో అరెస్ట్ చేసి, జైలుకు త‌ర‌లిస్తారు అనురాగ్. విచారణలో అమాయకులమని అక్షిక,ఫాజిల్ వెల్లడిస్తారు. కానీ, విచారణ కొనసాగుతూనే ఉంటుంది. 

అయితే మర్డర్ చేయబడిన ఇద్దరూ వ్యక్తులు పార్థ(కబీర్ సింగ్) మనుషులు కావడంతో అక్షికను, ఫాజిల్ ను చంపేయాలని సిన్సియర్ ఆఫీసర్ అయిన అనురాగ్ ని కేసు నుంచి తప్పించి, పార్థ తమ్ముడు, అతని మనుషులు అక్ష, ఫాజిల్ ని కోర్టుకు తీసుకెళ్తుండగా వారిపై అటాక్ చేయడంతో..వారిద్దరితో పాటు డాక్టర్ ఇరానీ(అనీష్ కురువిళ్ళ) వచ్చి పార్థ తమ్ముడ్ని చంపేస్తారు. 

అసలు పార్థ‌కీ, హ‌త్యలు చేస్తున్న ఈ సాధార‌ణ వ్య‌క్తుల‌కీ సంబంధ‌మేంటి? ఇలాంటి అంతుచిక్కని కేసుని అనురాగ్ సాల్వ్ చేశాడా? పర్యావరణ ప్రేమికుడు పురుషోత్తం రెడ్డి(జగపతిబాబు)కి ఈ ముగ్గురికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? వంటి తదితర విషయాలు తెలియాలంటే థియేటర్లో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 

ఎలా ఉందంటే?

'ఇదిగో మన ప్రకృతి మాత..మన సొంత బిడ్డ' ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అంత బాగుంటాం అని తెలిపేలా ట్రైలర్, టీజర్ లో మేకర్స్  ఇంకా చెప్పాలంటే..'ప్రపంచంలో సిగరెట్లు, మందు కంటే గాలి కాలుష్యం కారణంగా 25% ఎక్కువగా చనిపోతున్నారనే స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ, చెట్ల‌ని పెంచండి ప‌ర్యావ‌ర‌ణాన్ని ర‌క్షించండి అనే మెసేజ్ కూడా తెలిపారు. అంతేకాకుండా హైదరాబాద్ నగరంలో వరుస మర్డర్స్ జరగడం కూడా చూపించారు. 

ఈ సినిమా మాములుగా ఒక రివెంజ్ స్టోరీ అయినా దానికి సెల్యులర్ మెమరీ, బయోలజికల్ మెమరీ అనే కొత్త కాన్సెప్ట్ తో పాటు మొక్కలు నాటాలి అని పర్యావరణానికి సంబంధించిన మెసేజ్ ఇవ్వడం ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. రెగ్యులర్ గా వ‌చ్చే థ్రిల్ల‌ర్ సినిమాల‌కు భిన్నంగా అంద‌రిలోనూ ఆలోచ‌నని రేకెత్తించేలా, స‌మాజానికి ఎంతో అవసరమైన పర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ అంశాన్ని ఇందులో చెప్పే కాన్సెప్ట్ బాగుంది. ఇక ఈ సినిమా మొదలయిన కొద్దిసేపటికే కథలోకి ప్రేక్షకులు వెళ్ళిపోతారు. ఇక ఇంటర్వెల్ వచ్చే తిమెకి వరుస మర్డర్లు జరిగే క్రమంలోనే వీళ్ళ మైండ్ లో ఏం మెదులుతుంది? ఎందుకిలా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు అని ఆసక్తి కలిగినా సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కొంచెం కథనం సాగదీసినట్టు ఉంటుంది. ఓ స్కూల్ టీచ‌ర్ దారుణంగా ఓ వ్య‌క్తిని అంతం చేసి ఏం తెలియనట్లుగా ఇంటికి వెళ్లే సీన్స్ ప్రేక్ష‌కుడిని క‌థ‌లో లీనం అయ్యేలా చేస్తాయి. కానీ,సీరియ‌స్‌గా సాగాల్సిన కథనం ఆ త‌ర్వాత ఫాజిల్, ఇష్ట (దివి వైద్య‌) ప్రేమాయ‌ణంతో గాడి త‌ప్పుతున్నా ఫీలింగ్ వస్తోంది.

అలాగే మ‌రోవైపు పోలీస్ ఇన్వెస్టిగేష‌న్‌లోనూ పస కనిపించదు.సీసీటీవీ ఫుటేజీ, ఫోన్ కాల్ లిస్ట్‌తోనే హ‌త్య చేసిన అక్షిక‌, ఫాజిల్ దొరికిపోవ‌డం ఇది సామాన్యంగా దొరికిపోవడం, పట్టుకోవడం అనేలా ఉందనిపిస్తుంది. పర్యావరణం, మొక్కలు గురించి చెప్పడంమంచిదే కానీ ఇందులో క్లాస్ పీకినట్టు ఉండడం ఆడియన్స్ కు బోర్ కొట్టేలా చేస్తాయి.అయితే కథ పరంగా మాత్రం సెల్యులర్ మెమరీ అనే ఒక కొత్త పాయింట్ ని తీసుకొచ్చి ప్రేక్షకులు నమ్మదగిన విధంగానే చూపించారు డైరెక్టర్ మనోహర్ రెడ్డి మరియు కథ రాసిన డైరెక్టర్ సంపత్ నంది. 

ఎవరెలా చేశారంటే?

అనసూయ భరద్వాజ్ ఎప్పటిలాగే తన పాత్రను మరింత ధీటుగా కనిపించేలా నటించింది. ఓ వైపు టీచర్ గా, మరో వైపు యాక్షన్, క్రైమ్ లో నటించి మెప్పించింది. జ‌గ‌ప‌తిబాబు, శ్రీనాథ్ మాగంటి, అనీష్ కురువిల్లా త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. సీనియర్ హీరోయిన్స్ గౌత‌మి, క‌స్తూరి ద్వితీయార్థంలో సంద‌డి చేస్తారు. దివి, అనీష్ కురువిళ్ళ, కస్తూరి.. మిగిలిన నటీనటులు ఓకే అనిపిస్తాయి. విలన్ గా నటించిన క‌బీర్ పాత్ర‌లో అంతగా బ‌లం లేదు. 

సాంకేతిక అంశాలు::

కృష్ణ‌ సౌర‌భ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సీన్స్ లో సూపర్బ్ గా ఉంది. ఈ సినిమాకి స్టోరీ, డైలాగ్స్ అందించిన డైరెక్టర్ సంపత్ నంది తనలోని కమర్షియల్ యాంగిల్ ని పక్కన పెట్టి కొత్త పాయింట్ ని రాసుకున్నారు. డైరెక్టర్ మురళి మోహన్ రెడ్డి ఫస్ట్ సినిమా అయినా అందరినీ మెప్పించేలా డైరెక్ట్ చేశాడు. కృష్ణ‌ప్ర‌సాద్ కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తాయి. నిర్మాణం బాగుంది.