మట్టి పాత్రలో ద్రాక్షపండ్లు..ఆరు నెలల వరకు చెడిపోవు

ఎండాకాలం పండ్లు, కూరగాయలు త్వరగా పాడైపోతాయి. అందుకే వాటిని ఫ్రిజ్​ల్లో దాచిపెడుతుంటారు. ఇప్పుడంటే ఫ్రిజ్​ ఉంది కాబట్టి సరిపోయింది. మరి వెనకటి రోజుల్లో పండ్లని ఎలా స్టోర్ చేసుకునేవాళ్లు? అప్పుడు టెక్నాలజీ ఇంత డెవలప్​ అవ్వలేదు కదా! అవును మరి డౌట్ రావడం సహజం. అయితే అఫ్ఘాన్​ ప్రజల టెక్నిక్  చూస్తే... ముక్కున వేలేసుకోవడం ఖాయం.
అఫ్ఘానిస్తాన్​లో ద్రాక్ష పండ్ల సాగు చాలా బాగుంటుంది. కానీ, వాటిని ఎక్కువ రోజులు నిల్వ చేయడమే కష్టం. ఎండాకాలంలో అయితే త్వరగా పాడైపోతాయి. అందుకని దానికో సొల్యూషన్ కనిపెట్టారు. ఆరు నెలల వరకు పాడవ్వకుండా ఉండేలా మాస్టర్ ప్లాన్​ వేశారు. అదేంటో తెలుసా? మట్టి పాత్రలను వాడటం. పూర్వకాలం మట్టి పాత్రల్లోనే వంటావార్పు చేసేవారని తెలిసిందే. అలాగే మట్టిపాత్రలో ద్రాక్షపండ్లు పెట్టాక పై నుంచి మట్టి మూత పెట్టి అది ఓపెన్ కాకుండా అతికించేవాళ్లు. కాబట్టి దాంట్లో పెట్టిన ద్రాక్ష తినాలంటే ఆ మట్టి పాత్రని పగలకొట్టాల్సిందే. అలా వాళ్లు ద్రాక్షపండ్లని స్టోర్ చేసుకునేవాళ్లట. ఆ మట్టి పాత్రలను ‘కంగిన’ అంటారు. ఇప్పటికీ అక్కడ ఈ పద్ధతిని అనుసరించేవాళ్లు ఉండటం వల్లనే ఈ పద్ధతి గురించి తెలిసింది. ఇప్పటికే చాలామంది ఫ్రిజ్​కు బదులు మట్టి కుండలు, కూజాలు, బాటిల్స్​ వాడుతున్నారు. ఎంతైనా మట్టితో మనకున్న అనుబంధం ఈనాటిదా!
మట్టి పాత్రలో ద్రాక్ష నిల్వ ఉండడం బాగానే ఉంది. దాని వెనక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది అంటున్నారు కార్నెల్​ యూనివర్సిటీ అసోసియేట్​ ప్రొఫెసర్​ జీన్​ హంటర్. ‘‘దీన్ని పాసివ్ కంట్రోల్డ్ అట్మాస్పియర్ స్టోరేజ్ అంటారు. ద్రాక్షపండ్లే కాకుండా ఆక్సిజన్​ని ఉపయోగించుకుని, కార్బన్​ – డై – ఆక్సైడ్, నీటి ఆవిరిని విడుదల చేసే ఏ పండ్లైనా ఈ విధంగా నిల్వ చేసుకోవచ్చు.  బంకమట్టి గాలిలో ఉన్న ఆక్సిజన్​ని తీసుకుంటుంది. పాత్ర లోపల కార్బన్​ – డై – ఆక్సైడ్ గాఢత ఎక్కువ ఉండడం వల్ల జీవక్రియలు జరగవు. దాంతో ఫంగస్​ పెరిగే ఛాన్స్ లేదు. నీరు ఆవిరవడం కూడా చాలా స్లోగా జరుగుతుంది. దానివల్ల ద్రాక్ష ఎండిపోదు. ఒకవేళ దాని మీద నీళ్లు పడినా మట్టి పీల్చుకుంటుంది. కాబట్టి బ్యాక్టీరియా పెరిగే అవకాశం లేదు. ఈ టెక్నాలజీ వల్లే మట్టిపాత్రల్లో ద్రాక్షపండ్లు ఆరు నెలలు నిల్వ ఉంటున్నాయ’’ని చెప్పారాయన.