చేర్యాల, వెలుగు : మండలంలోని నాగపురి గ్రామ రెవెన్యూ శివారు కొండపోచమ్మ (నల్ల పోచమ్మ) చెరువు శిఖంలో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె అశోక్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ నాగపురి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 831లో కొండ పోచమ్మ చెరువు 22.02 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. చెరువు శిఖంలో కొందరు అక్రమార్కులు కబ్జా చేసి నిర్మాణాలు చేశారని ఆరోపించారు.
అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులకు, అధికారులకు గ్రామస్తులు ఎన్ని సార్లు పిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. రెవెన్యూ, ఐబీ అధికారులకు విషయం తెలిసినప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. హైడ్రా తరహాలో చెరువు శిఖంలో అక్రమ నిర్మాణాలను తొలగించి కాపాడాలని కోరారు. లేనిపక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.