James Anderson: నా సక్సెస్ క్రెడిట్ ఆ భారత బౌలర్‌కే దక్కుతుంది: జేమ్స్ అండర్సన్

James Anderson: నా సక్సెస్ క్రెడిట్ ఆ భారత బౌలర్‌కే దక్కుతుంది: జేమ్స్ అండర్సన్

టెస్ట్ కెరీర్ లో 698 వికెట్లు.. రెండు దశాబ్దాలకు పైగా ఆట.. ఇప్పటికీ చెక్కు చెదరని ఫిట్ నెస్.. అతని స్వింగ్ ధాటికి హడలిపోయే ప్రత్యర్థి బ్యాటర్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంగ్లాండ్  దిగ్గజ బౌలర్ జేమ్స్ అండర్సన్ కెరీర్ లో చాలానే ప్రత్యేకతలు ఉన్నాయి. అద్భుతమైన స్వింగ్ తో పాటు అతని ఫిట్ నెస్ నేటికీ ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. కుర్రలతో పోటీ పడుతూ 41 ఏళ్ళ వయసులోనూ తన వికెట్ల  వేటను కొనసాగిస్తున్నాడు. ఇన్ని ఘనతలు సాధించిన అండర్సన్ భారత బౌలర్ దగ్గర నుంచి పాఠాలు నేర్చుకున్నా అని చెబుతున్నాడు. 

టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ భారత దిగ్గజ బౌలర్లలో ఒకడని ప్రత్యేకంగా చెప్పకోవాల్సిన అవసరం లేదు. అతడి బౌలింగ్ కు అండర్సన్ కూడా ఫిదా అయినట్లు తెలుస్తుంది. జహీర్ ఖాన్ ను చూసి తనలా బౌలింగ్ వేసేందుకు ప్రయత్నించే వాడినని.. అతను రివర్స్ స్వింగ్ ఎలా వేస్తున్నాడో గమనించేవాడినని ఈ ఇంగ్లీష్ బౌలర్ తెలిపాడు. జహీర్ చేతితో బంతిని  కవర్ చేసే విధానాన్ని అతని దగ్గర కాపీ కొట్టానని.. ఈ చిట్కాలతోనే నా బౌలింగ్ మెరుగుపడిందని అండర్సన్ JioCinemaతో అన్నారు.
      
ప్రస్తుతం అండర్సన్ భారత్ తో టెస్ట్ సిరీస్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. హైదరాబాద్ లో జరిగిన తొలి టెస్టులో అవకాశం దక్కకపోయినా ఆ తర్వాత వరుసగా మూడు టెస్టుల్లో ఆడి రాణించాడు. ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్ లో 698 వికెట్లు పూర్తి చేసుకున్న ఈ దిగ్గజ బౌలర్.. మరో రెండు వికెట్లు పూర్తి చేసుకుంటే 700 వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మూడో బౌలర్ గా నిలుస్తాడు. శ్రీలంక స్పిన్ దిగ్గజ బౌలర్ మురళీధరన్(800), షేన్ వార్న్ (708) మాత్రమే అండర్సన్ కన్నా ముందున్నారు.