హైదరాబాద్, న్యూఢిల్లీ, వెలుగు: కృష్ణా ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ)కు అప్పగించడంపై ఏపీ వితండ వాదం చేసింది. శ్రీశైలం, నాగర్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులను కేంద్రం పరిధిలోకి తీసుకోవాలని, అవసరమైతే ఆయా ప్రాజెక్టుల వద్ద పోలీస్ బందోబస్తును పెంచాలని డిమాండ్ చేసింది. అయితే, తెలంగాణ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ట్రిబ్యునల్ అవార్డ్ మేరకే బోర్డు పనిచేయాల్సి ఉంటుందని, అంతకుమించి అధికారం బోర్డుకు లేదని స్పష్టం చేసింది.
తెలంగాణ వేసిన రిట్ పిటిషన్ 666, ఏపీ దాఖలు చేసిన రిట్ పిటిషన్ 772లు సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చాయి. రెండు వేర్వేరు బెంచ్‌ల ముందు విచారణకు వచ్చిన ఈ పిటిషన్లను సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ (సీజేఐ) వద్దకు ఆయా బెంచ్‌లు పంపాయి. రెండు పిటిషన్లు ఒకే అంశానికి సంబంధించినవి కావడంతో ఒకే బెంచ్ విచారిస్తేనే బాగుంటుందని కోర్టు అభిప్రాయపడింది. తెలంగాణ, ఏపీ పిటిషన్లను కోర్టు రిజిస్ట్రికీ పంపిన బెంచ్‌లు.. వాటిని సీజేఐ వద్దకు పంపాలని, ఆయా పిటిషన్లను విచారించే బెంచ్‌పై సీజేఐ నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నాయి. ఈ కేసులో సుదీర్ఘ వాదనలు వినాల్సి ఉన్నందున విచారణను గురువారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది.
కేంద్రం అధీనంలోకి తీసుకోవాలన్న ఏపీ
ఏపీ మాత్రం శ్రీశైలం, సాగర్‌తో పాటు పులిచింతల రిజర్వాయర్‌నూ కేంద్రం తన పరిధిలోకి తీసుకోవాలని ఏపీ తన పిటిషన్‌లో వాదించింది. అవసరమైతే పోలీస్ ప్రొటెక్షన్‌నూ ప్రాజెక్ట్‌ల వద్ద పెట్టాలని తెలిపింది. అందుకు తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ సుప్రీంకోర్టును కోరింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా తెలంగాణ నీటిని తీసుకెళ్తున్నదని వాదించింది. ఆ ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీ పరిధిలోనే ఉంచాలంటూ విభజన చట్టంలో పేర్కొన్నారని తెలిపింది. ఇక, విద్యుదుత్పత్తి పేరుతో శ్రీశైలం నీటిని తెలంగాణ సముద్రంపాలు చేస్తున్నదని, అందుకు జీవో 34ని జారీ చేసిందని, ఆ జీవోని కొట్టేయాలని ఏపీ డిమాండ్ చేసింది.
ఇదీ తెలంగాణ వాదన
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగిస్తూ 2021 జులై 15న కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్‌ను.. దానికి అనుబంధంగా 2022 జులై 27న జారీ చేసిన సవరణ గెజిట్‌ను రద్దు చేయాలని పిటిషన్‌లో తెలంగాణ సర్కారు వాదించింది. విభజన చట్టం ప్రకారం ట్రిబ్యునల్ అవార్డు మేరకు లేదా అంతర్రాష్ట్ర ఒప్పందాల ప్రకారమే కేఆర్‌ఎంబీ పని చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రాజెక్టుల పర్యవేక్షణకు సంబంధించి నీటి వాటాల పంపకంపై ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగినట్టు ట్రిబ్యునల్ బైండింగ్ లేదని స్పష్టం చేసింది. కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ -2 ప్రాజెక్ట్‌లవారీగా కేటాయింపులను చేసిందని పేర్కొన్నది.