అదనంగా లక్ష ఎకరాలకు నీళ్లు
రూ.17,363 కోట్లతో రిజర్వాయర్లు, లిఫ్టులు, ఇతర పనులు
హంద్రీనీవా, గాలేరు–నగరికి లింక్ చేస్తూ నీళ్ల దోపిడీ
కొత్త స్టోరేజీ లేదంటూ ఓవైపు బుకాయింపు
ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకునేలా లాబీయింగ్
హైదరాబాద్, వెలుగు: అదనపు ఆయకట్టు లేదు, స్టోరేజీ లేదంటూ సంగమేశ్వరం నీళ్లు నిల్వ చేసుకునేలా ఏపీ కొత్త రిజర్వాయర్లు కడుతోంది. ఓ పాత రిజర్వాయర్ కెపాసిటీని బాగా పెంచేందుకు పనులు చేపడుతోంది. ఏకంగా లక్ష ఎకరాల అదనపు ఆయకట్టుకు నీళ్లు ఇచ్చేలా ప్లాన్ చేసుకుంది. రూ.17,363 కోట్లు ఖర్చు అంచనాతో కొత్త రిజర్వాయర్లు, లిఫ్టులు, కాల్వలు, ఇతర పనులు మొదలుపెడుతోంది. కొన్ని పనుల టెండర్ల ప్రక్రియ కొలిక్కి రాగా, మరికొన్ని టెండర్లు ఫైనల్ స్టేజీలో ఉన్నాయి. ఇంత చేస్తున్న ఏపీ సర్కారు.. పాత ప్రాజెక్టులకు సప్లిమెంట్ చేయడానికే సంగమేశ్వరం లిఫ్ట్చేపట్టామని, డీపీఆర్ ఇవ్వాల్సిన అవసరమే లేదనే వాదిస్తోంది. ఇదే వాదనను ముందుపెట్టి.. ప్రాజెక్టుకు దొడ్డిదారిలో అనుమతులు పొందేందుకు లాబీయింగ్ చేస్తోంది.
నిజాలను తొక్కిపెట్టి..
శ్రీశైలంలో 881 అడుగుల లెవెల్లో నీటి మట్టం ఉంటే తప్ప పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి పూర్తి స్థాయిలో నీటిని తీసుకోలే మంటూ.. ఏపీ సంగమేశ్వరం వద్ద లిఫ్ట్ స్కీం చేపట్టింది. అయితే ఏపీ వాదన తప్పని గతంలోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిన ఎక్స్ పర్ట్ కమిటీ మెంబర్, హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ లెక్కలతో సహా నిరూపించారు. శ్రీశైలంలో 854 అడుగుల నీటి మట్టం ఉన్నా పోతిరెడ్డిపాడు నుంచి పూర్తి స్థాయిలో నీటిని డ్రా చేయవచ్చనే నిజాన్ని ఏపీ తొక్కి పెడుతోంది. రిజర్వాయర్ లో లెవెల్ మెయింటెనెన్స్‌పై తప్పుడు ప్రచారం చేస్తోంది. తెలుగు గంగ, గాలేరు నగరి, శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్, కేసీ కెనాల్ ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడానికే కొత్త లిఫ్ట్ చేపట్టామని వాదిస్తోంది. సంగమేశ్వరం కొత్త ప్రాజెక్టు కాదు కాబట్టి డీపీఆర్ ఇవ్వాల్సిన అవసరం లేదని అంటోంది. ఇప్పటికే ఓసారి కృష్ణా బోర్డుతో భేటీ అయిన ఏపీ ఇంజనీర్లు త్వరలో మరోసారి సమావేశం కానున్నారు.
హంద్రీనీవా నుంచి మొదలు పెట్టి
ఏపీ 4 వేల క్యూసెక్కుల కెపాసిటీ ఉన్న హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్)పై కొత్త ప్రాజెక్టులు తలపెట్టింది. ఇప్పటికే హెచ్ఎన్ఎస్ఎస్ ఆయకట్టు అంతటికీ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచే నీళ్లివ్వడానికి స్కీమ్‌లు చేపట్టిన ఏపీ.. ఇప్పుడు సంగమేశ్వరం నీటినీ తరలించడానికి కొత్త స్కీమ్‌లను తెరపైకి తెచ్చింది. గాలేరు– హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ పనులను రెండు దశల్లో చేపట్టి కొత్త రిజర్వాయర్లు కడుతోంది. కృష్ణా నదికి వరద వచ్చే 30 నుంచి 40 రోజుల్లో శ్రీశైలం నుంచి తరలించే నీటిని పూర్తిగా వాడుకునేందుకు వీలుగా ఈ కొత్త పనులు చేస్తోంది. కానీ అవన్నీ పాత ప్రాజెక్టులేనని, వాటికి సంగమేశ్వరంతో సంబంధం లేదని అడ్డగోలుగా వాదిస్తోంది. మరి శ్రీశైలం నుంచి నీళ్లు రాకుంటే కింద ప్రాజెక్టులు ఎందుకు కడ్తున్నరు, వాటితో ఉపయోగం ఏమిటన్న ప్రశ్నలకు ఏపీ ఇంజనీర్లు సమాధానం చెప్పడం లేదు.
త్వరలోనే కృష్ణాబోర్డుతో రెండో మీటింగ్
సంగమేశ్వరం లిఫ్ట్ స్కీం డీపీఆర్, ఇతర పర్మిషన్లపై చర్చించేందుకు కృష్ణాబోర్డు చైర్మన్ పరమేశంతో ఏపీ ఇంజనీర్లు వచ్చే వారంలో రెండోసారి భేటీ కానున్నారు. ఇప్పటికే ఈ నెల 4న హైదరాబాద్‌లోని జలసౌధకు వచ్చిన ఏపీ ఇంజనీర్లు.. బోర్డు చైర్మన్ సెలవులో ఉండటంతో మెంబర్ సెక్రటరీ పరమేశం, సీనియర్ మెంబర్ హరికేశ్ మీనాతో భేటీ అయ్యారు. ఆ మీటింగ్‌లో సంగమేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఇప్పటికే ప్రారంభించామని చెప్పిన ఏపీ ఈఎన్సీ… త్వరలో జరిగే మీటింగ్ లో కొత్తగా ఏయే అంశాలపై చర్చిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఏపీ కొత్తగా చేపట్టిన స్కీమ్లివే..
బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి నిప్పులవాగు, గాలేరు, కుందూ నది కెపాసిటీని 35 వేల క్యూసెక్కులకు పెంచడం, నదికి ఇరువైపులా కరకట్టల నిర్మాణం, కుందూ నదిపై రాజోలి ఆనికట్టకు ఎగువన 2.95 టీఎంసీల కెపాసిటీతో రిజర్వాయర్, జోలదరాశి వద్ద 0.80 టీఎంసీలతో మరో రిజర్వాయర్ నిర్మాణానికి రూ.1,769.15 కోట్లతో టెండర్లు పిలవగా.. రూ.1,758.82 కోట్లకు ఎమ్మార్కేఆర్ – రిత్విక్ ప్రాజెక్ట్స్ జాయింట్ వెంచర్
దక్కించుకుంది.
గాలేరు– నగరి కాలువల నుంచి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కాల్వల్లోకి నీటిని ఎత్తిపోసే పనులకు రూ.5,036 కోట్లతో టెండర్లు పిలిచిన ఏపీ సర్కారు.. గిడ్డంగివారిపల్లి దగ్గర 1.20 టీఎంసీల కెపాసిటీతో కొత్త రిజర్వాయర్ కడ్తోంది. ఇదే ప్రాజెక్టులో 0.10 టీఎంసీలతో కెపాసిటీతో మరో రిజర్వాయర్ పనులకు టెండర్లు పిలిచింది.
చిత్తూరు జిల్లాలోని ముదివేడు (2 టీఎంసీలు), నేతిగుంటపల్లి (టీఎంసీ), ఆవులపల్లి (3.50 టీఎంసీలు) కొత్త రిజర్వాయర్లకు రూ.2,144.50 కోట్లు మంజూరు చేసింది. కొత్తగా 70 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించడంతో పాటు.. 40 వేల ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గాలేరు– నగరి సుజల స్రవంతి ప్రధాన కాల్వ నుంచి చక్రాయిపేట లిఫ్ట్ స్కీం ద్వారా హెచ్‌ఎన్‌ఎస్ రెండో దశలోని పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌లోకి నీటిని ఎత్తిపోస్తారు.
జీఎన్‌ఎస్‌ఎస్ (గాలేరు-నగరి సుజల స్రవంతి) – హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ రెండో దశ లింక్ స్కీమ్‌కు రూ.4,373.93 కోట్లతో ఏపీ టెండర్లు పిలిచింది. జీఎన్‌ఎస్‌ఎస్ మెయిన్ కెనాల్ 56వ కిలోమీటర్వద్ద నుంచి రోజుకు 2 వేల క్యూసెక్కుల నీటిని తరలించి కడప, చిత్తూరు జిల్లాల్లోని కరువు ప్రాంతాలకు నీటిని అందిస్తారు. కాలేటి వాగు రిజర్వాయర్ కెపాసిటీని 0.225 టీఎంసీల నుంచి 1.20 టీఎంసీలకు పెంచారు. కల్లూరిపల్లి చెరువు, నాయుని చెరువుల కెపాసిటీని పెంచడంతోపాటు వేంపల్లి వద్ద 0.10 టీఎంసీలతో సమ్మర్ స్టోరేజీ ట్యాంకును నిర్మించనున్నారు.
గండికోట– చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లిఫ్ట్ స్కీం కెపాసిటీ పెంచే పనులకు రూ.4,039.97 కోట్లతో టెండర్లు పిలిచారు. దీనికింద 1.38 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని ప్రతిపాదించారు. కడప జిల్లాలోని జొన్నవరం దగ్గర కుందూ నదిపై వియర్ నిర్మించి తెలుగు గంగ ప్రాజెక్టులో భాగమైన సబ్సిడరీ రిజర్వాయర్లోకి నీటిని ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి బ్రహ్మంసాగర్లోకి లిఫ్ట్ చేస్తారు.
ఈ పనులన్నీ కూడా రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్టులో భాగంగా ఏపీ ప్రభుత్వం చేపడుతోంది. అన్నింటికీ నీటి సోర్సు శ్రీశైలం రిజర్వాయర్.. దీనిపై ఏర్పాటు చేసిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, సంగమేశ్వరం లిఫ్ట్ స్కీములే. ఏపీ బాజాప్తాగా టెండర్లు పిలిచి పనులు చేస్తూ కూడా.. కొత్తగా ఆయకట్టు, స్టోరేజీ లేదంటూ ప్రకటనలు చేస్తోంది.