ఏపీలో మొత్తం పోలింగ్ 81.86 శాతం.. దేశంలోనే ఇప్పటి వరకు ఇదే టాప్

 ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ జరిగిన రెండు రోజుల తర్వాత పోలింగ్ శాతాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఈవీఎంలు బద్దలయ్యేలా ఓట్లు పడ్డాయి. ఉప్పెనలా కదిలి వచ్చిన ఓటర్లు తమకు నచ్చిన పార్టీకి అనుకూలంగా ఓట్లు వేశారు. 

2024 ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో పోలింగ్ స్టేషన్‌కు వచ్చి ఓటు వేసిన వారి శాతం 80.66 శాతంగా తేల్చారు. ఇది కాకుండా పోలింగ్ విధులకు హాజరయ్యే సిబ్బంది వేసిన బ్యాలెట్ ఓట్లు దీనికి అదనంగా చెబుతున్నారు. ఇది 1.20 శాతం ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో నమోదైన మొత్తం పోలింగ్ శాతం 81.86 శాతం. ఇది గత ఎన్నికల్లో నమోదైనదాని కంటే ఎక్కువ. 2019 కంటే 2 శాతం పెరిగింది. ముందుగానే టార్గెట్‌గా పెట్టుకున్న 82 శాతం విజయవంతంగా రీచ్ అయ్యామన్నారు ఎన్నికల ప్రధాన అధికారిల ముఖేష్‌కుమార్‌ మీనా. దేశంలో ఇప్పటి వరకు జరిగిన నాలుగు దశల్లో ఇదే ఎక్కువని పేర్కొన్నారు. వేకువ జామున రెండు గంటల వరకు పోలింగ్ జరగడం వల్లే పోలింగ్‌ శాతాలు ఆలస్యంగా చెప్పాల్సి వస్తుందని అన్నారు. మొత్తం పోలింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేసరికి మంగళవారం ( మే 14)  సాయంత్రం అయిందన్నారు.. 

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఉదయం భారీగా ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు వచ్చారని... మధ్యాహ్నానికి కాస్త పల్చబడ్డారని పేర్కొన్నారు మీనా. సాయంత్రం నాలుగు గంటల తర్వాత భారీగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చారని తెలిపారు. అందుకే 6 గంటల తర్వాత కూడా 3,500 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగిందని ఇది వేకువ జాము 2 గంటల వరకు కొనసాగినట్టు వివరించారు. 

ఈసారి ఎన్నికల్లో చాలా అనూహ్యమైన ఘటనలు జరిగాయన్నారు ముఖేష్‌కుమార్ మీనా. పార్లమెంట్‌ కు ఓటు వేసే వారితో పోల్చుకుంటే అసెంబ్లీ అభ్యర్థులు ఓటు వేసే వారి సంఖ్య 200 మంది ఎక్కువ ఉన్నారని తెలిపారు. ఈసారి అర్బన్‌లో కూడా ఓటింగ్ శాతం పెరిగింది అందుకు విశాఖలో నమోదు అయిన పోలింగ్ ఉదాహరణగా పేర్కొన్నారు. 

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల పోలింగ్ శాతం అసెంబ్లీ సెగ్మెంట్‌లో చూసుకుంటే దర్శిలో ఎక్కువ శాతం నమోదైంది. ఇక్కడ 90.91 శాతం ఓటింగ్ పోల్ అయింది. పార్లమెంట్‌ స్థానంలో విషయంలో ఒంగోలు 87.6తో టాప్ ప్లేస్‌లో ఉంది. ఇక 63.32 శాతంతో కడప అసెంబ్లీ సెగ్మెంట్‌ అతి తక్కువ పోలింగ్ శాతం నమోదు చేసుకుంది. పార్లమెంట్ సెగ్మెంట్‌ విషయానికి వస్తే విశాఖ ఆఖరి స్థానంలో ఉంది. ఇక్కడ 69.9 శాతం మాత్రమే పోలింగ్ నమోదు అయింది. అత్యధికంగా దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో 90.91, అత్యల్పంగా తిరుపతి నియోజకవర్గంలో 63.32 శాతం పోలింగ్‌ నమోదైందని వివరించారు. కుప్పంలో 89.88 శాతం పోలింగ్ నమోదైంది అయితే 2019తో పోల్చుకుంటే ఇక్క పోలింగ్ శాతం పెరిగింది. గత ఎన్నికలతో పోల్చుకుంటే 3.8 శాతం పెరిగింది. 

గత ఎన్నికల్లో నమోదు అయిన పోలింగ్ సరళిని చూస్తే

2019లో - 79.80 శాతం 
2014లో-78.90 శాతం 
2009లో-79.80 శాతం 
2004లో- 69.8 శాతం

ఏపీలో ఎన్నికల సందర్భంగా అల్లర్లు సృష్టించిన నిందితులను రెండ్రోజుల్లో అరెస్ట్ చేస్తామని సీఈఓ ఆర్కే మీనా ప్రకటించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈవీఎంలు ధ్వంసం చేసిన వారిని జైలుకు పంపిస్తామన్నారు. ప్రస్తుతం 715 ప్రాంతాల్లో పోలీస్ పికెట్ కొనసాగుతోందన్నారు. స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర పార్టీలకు చెందిన ప్రతినిధి 24 గంటలు ఉండవచ్చన్నారు