ప్రేమకు ఏదీ అడ్డుకాదు.. ప్రాంతం, కులం, మతం అన్న భేద భావాలు ఉండవు. ఇద్దరి మధ్య ప్రేమ ఉంటే చాలు.. మాటలు రాకున్నా మౌనమే భాష అవుతుంది! వారికి ఏ సమస్యా అనిపించదు. పరస్పరం ఒకరినొకరు అర్థం చేసుకోగలరు. ఇక సోషల్ మీడియా వచ్చాక ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న వాళ్లు పరిచయాలు పెంచుకోవడమే కాదు.. ప్రేమలో పడి మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన వాళ్లెందరో ఉన్నారు. ఈ సోషల్ మీడియానే మాటలు రాని ఓ జంటను ఒక్కటి చేసింది. వారిద్దరూ బధిరులు (మూగ, చెవుడు). వారి మధ్య మాటలు లేని కొరతను ఇన్స్టాగ్రామ్ తీర్చింది. ఆన్ లైన్ లో మొదలైన పరిచయం.. ప్రేమగా మారి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఈ ఇద్దరు యువతీ, యువకులను ఒక్కటి చేసింది.
తెలంగాణలోని జగిత్యాల జిల్లా రాయికల్ కు చెందిన అత్రం లత అలియాస్ జ్యోతి అనే యువతి, ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలుకు చెందిన అరుణ్ అనే యువకుడి మధ్య ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. ఇన్స్టా చాట్ లోనే ఒకరి భావాలను ఒకరు పంచుకున్నారు. ఇద్దరి మనసులు కలవడంతో ప్రేమలో పడ్డారు. ఈ విషయాన్ని వారి పెద్దలకు తెలిపి.. పెళ్లికి ఒప్పించారు. దీంతో ఈ దివ్యాంగ జంటకు మహ్మద్ బాబుజాన్ , సామాజిక కార్యకర్త రియజుద్దీన్, కాసారపు రమేష్ కలిసి.. స్నేహితులు, పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం చేశారు.