హైదరాబాద్: తెలంగాణ ప్రజా ప్రతినిధులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు శుభవార్త చెప్పారు. తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఇకపై తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు వారానికి రెండు సిఫార్సు లేఖలకు ఏపీ సీఎం అంగీకారం తెలిపారు. వారానికి రెండు, మూడు వందల రూపాయల దర్శనానికి సిఫార్సులకు ఏపీ సీఎం చంద్రబాబు అనుమతి తెలిపినట్లు సీఎంతో భేటీ అనంతరం టీటీడీ చైర్మన్ మీడియాకు వెల్లడించారు.
తిరుమలలో తెలంగాణ నేతల సిఫార్సు లేఖలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని టీటీడీ ఈవో శ్యామలరావు సూచించిన రోజుల వ్యవధిలోనే టీటీడీ చైర్మన్ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. తెలంగాణ నుంచి నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు వెళుతుంటారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి టీటీడీలో తెలంగాణ నేతలు ఇచ్చిన లేఖలు చెల్లడం లేదని భక్తుల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి.
ALSO READ | తెలంగాణకు తిరుమల షాక్.. సిఫార్సు లేఖపై నిర్ణయం తీసుకోలేదన్న ఈవో
గడచిన నాలుగేళ్ల నుంచి ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ అయినప్పుడు ఈ అంశం చర్చకు వచ్చినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను ఆమోదించాలని ఎన్నో సార్లు మంత్రులు, ఎమ్మెల్యేలు కోరినా టీటీడీ బోర్డు పట్టించుకోలేదు. తిరుమలలో తెలంగాణ లెటర్లు అంగీకరించాలని 2023 నుంచి నేతలు పదే పదే కోరుతున్నారు.
ఇటీవల టీటీడీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన బీఆర్ నాయుడు.. తెలంగాణ సీఎంను, మంత్రులను కలిసినప్పుడు వారు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఎట్టకేలకు ఏపీ సీఎం చంద్రబాబు ఈ అంశంపై సానుకూలంగా స్పందించడంతో తెలంగాణ ప్రతినిధుల సిఫార్సు లేఖలు తిరుమలలో ఇకపై చెల్లుబాటు కానున్నాయి.