ఆంధ్ర ప్రదేశ్, ప్రశాంత ఏలూరు జిల్లాలో మహిళ హత్య కలకలం రేపింది. పనిచేసే దుకాణం నుండి లంచ్ కోసమని బయటకు వెళ్లిన సుజాత అనే వివాహిత.. సత్యనారాయణ అనే వ్యక్తి నివాసంలో రక్తపు మడుగులో కనిపించింది. ఈ హత్యలో ఎన్ని ట్విస్టులో తెరమీదకు వస్తున్నాయి.
ఉడుత సుజాత అనే వివాహిత ఏలూరు జిల్లా పట్టణంలోని ఓ దుకాణంలో పనిచేస్తుంది. ఎప్పటిలానే ఆదివారం ఉదయం ఇంటి నుండి షాపుకొచ్చిన ఆమె.. మధ్యాహ్నం సమయంలో లంచ్ కోసమని దుకాణం నుండి బయటకు వెళ్ళింది. అప్పటినుంచి కనిపించకుండా పోయిన ఆమె.. సోమవారం ఉదయం సత్యనారాయణ అనే వ్యక్తి నివాసంలో రక్తపు మడుగులో కనిపించింది. సదరు వ్యక్తే మహిళను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
అయితే మహిళను హత్య చేసినట్టుగా అనుమానిస్తున్న నిందితుడు కూడా నూజీవీడు రైల్వే స్టేషన్ సమీపంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివాహేతర సంబంధమే వీరి మరణానికి కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిన్న సాయంత్రం నుండి సుజాత కోసం గాలిస్తున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు చెప్తున్నారు. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడమో లేదంటే మరింత సమయం తనతో గడపడానికి సదరు వ్యక్తి బలవంతం చేసి ఉండొచ్చని స్థానికులు చెవుతున్నారు. ఇలా పలు ఊహాగానాలు తెరమీదకు వస్తున్న నేపథ్యంలో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.