ఏపీ నుంచి ఐదుగురికి పద్మ అవార్డులు

ఏపీ నుంచి ఐదుగురికి పద్మ అవార్డులు

హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదుగురు పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. కళల విభాగంలో హీరో నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్‌‌‌‌ అవార్డును కేంద్రం ప్రకటించింది. మరో నలుగురిని పద్మ శ్రీ పురస్కారం వరించింది. ఇందులో మిరియాల అప్పారావు (మరణానంతరం) (కళలు), కేఎల్ కృష్ణ (సాహిత్యం, విద్య),  మాడుగుల నాగఫణి శర్మ (ఆర్ట్), వాదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖి (సాహిత్యం, విద్య) ఉన్నారు.  మిరియాల అప్పారావు ఆంధ్రప్రదేశ్​కు చెందిన బుర్రకథా కళాకారుడు. ఈయనది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం. 

తన జీవితాన్ని బుర్ర కథకే అంకితం చేశారు. ఈ సాంప్రదాయ కథ చెప్పే కళారూపానికి ప్రాచుర్యం కల్పించారు. ఐదు దశాబ్దాలుగా ఈ కళారంగంలో కృషి చేశారు.  ప్రొఫెసర్ కె. ఎల్. కృష్ణ  ప్రముఖ ఆర్థికవేత్త. ఆర్థిక పరిశోధన, విద్యకు  గణనీయమైన కృషి చేశారు.

 వాదిరాజ్ రాఘవేంద్రచార్య పంచముఖి ఆర్థికవేత్త, సంస్కృత పండితుడు. ఆర్థిక శాస్త్రం, సంస్కృత సాహిత్యంలో  విస్తృత పరిశోధన చేశారు. మాడుగుల నాగఫణి శర్మది అనంతపురం జిల్లా తాడిపత్రి. ఈయన సహస్రావధానంలో దిట్ట. భారత మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, ఏబీ వాజ్‌‌‌‌పేయి, మాజీ రాష్ట్రపతి శంకర్‌‌‌‌దయాళ్‌‌‌‌ శర్మ వంటి వారి సమక్షంలో అవధానులు నిర్వహించి ప్రశంసలు పొందారు.  పలు అవార్డులు పొందారు.