Velugu Exclusive: శ్రీశైలం డ్యాంలో గొయ్యిపై పట్టించుకోని ఏపీ.. ఫౌండేషన్ దాటి క్రాకులు

Velugu Exclusive: శ్రీశైలం డ్యాంలో గొయ్యిపై పట్టించుకోని ఏపీ.. ఫౌండేషన్ దాటి క్రాకులు
  • శ్రీశైలం డ్యామ్ సేఫ్టీపై సర్కార్ ఫోకస్
  • అత్యంత ప్రమాదకరంగా ప్లంజ్​ పూల్ ​గొయ్యి
  • టెట్రాపాడ్స్​తో పూడ్చాలని ఇరిగేషన్ శాఖ యోచన
  • ఎన్డీఎస్ఏ చైర్మన్​కు లేఖ రాయాలని నిర్ణయం
  • ఇటీవల సీడబ్ల్యూసీ చైర్మన్​తో భేటీలో టెట్రాపాడ్స్​ ప్రస్తావన
  • ఎన్డీఎస్ఏకు లేఖ రాయాలని చైర్మన్ ​సూచన
  • 2009లోనే గొయ్యి పడినా నేటికీ పట్టించుకోని ఏపీ


హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం డ్యామ్​సేఫ్టీపై రాష్ట్ర సర్కార్ దృష్టి సారించింది. డ్యామ్​ప్లంజ్​పూల్‎లో పడిన భారీ గొయ్యిని పూడ్చేందుకు నడుం బిగించింది. 2009లో వచ్చిన భారీ వరదలకు 47 మీటర్ల లోతు, 400 మీటర్ల వెడల్పుతో ఏర్పడిన ఈ గొయ్యిని పూడ్చి డ్యామ్‎ను కాపాడేందుకు ఇప్పటివరకు ఏపీ ఎలాంటి చొరవ చూపలేదు. అప్పటి నుంచి ఏటికేడాది ఆ గొయ్యి డ్యామ్​వైపునకు పెరుగుతున్నట్టు కొన్నాళ్ల క్రితం చేసిన స్టడీల్లో తేలింది. ఈ నేపథ్యంలోనే దాన్ని అలాగే వదిలేస్తే డ్యామ్ మనుగడకే ముప్పు ముంచుకొస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ విషయంలో మన అధికారులే చొరవ తీసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. 

భారీ గొయ్యిని పూడ్చేందుకు టెట్రాపాడ్స్​అనే సీసీ బ్లాక్స్​(నాలుగు కోణాలుగా కోన్​ఆకారంలో ఉండే బ్లాకులు) ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీనిపై నేషనల్​డ్యామ్​సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) చైర్మన్‎కు లేఖ రాయాలని నిర్ణయించారు. ఈ మేరకు స్టేట్​డ్యామ్​సేఫ్టీ ఆర్గనైజేషన్ అధికారులకు ఈఎన్సీ జనరల్​బి.అనిల్​కుమార్ ఇప్పటికే ఆదేశాలిచ్చారు. 

సీడబ్ల్యూసీ ద్వారా ఏపీకి చెప్పించాలని.. 

ఇటీవల సీతారామ ప్రాజెక్టుకు టెక్నికల్​క్లియరెన్స్​కోసం ఢిల్లీలో మీటింగ్‎కు వెళ్లిన అధికారులు.. మంత్రి ఉత్తమ్ కుమార్​రెడ్డితో కలిసి సెంట్రల్​వాటర్​కమిషన్​(సీడబ్ల్యూసీ) చైర్మన్​ఎంకే సిన్హాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులకు క్లియరెన్సులతో పాటు శ్రీశైలం డ్యామ్​సేఫ్టీపైనా చర్చించారు. గొయ్యిని పూడ్చేందుకు టెట్రాపాడ్స్‎ను ఏర్పాటు చేస్తే డ్యామ్​పటిష్టంగా ఉంటుందని ఎంకే సిన్హాకు అధికారులు వివరించారు. ఆలోచన బాగుందని, ఎన్డీఎస్ఏ చైర్మన్‎కు లేఖ రాసి పంపాలని అధికారులకు ఎంకే సిన్హా సూచించారు.

ALSO READ | ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

దీంతో ఎన్డీఎస్ఏకు లేఖ రాసి అక్కడి నుంచి సీడబ్ల్యూసీకి సిఫార్సు చేయించాలని నిర్ణయించారు. సీడబ్ల్యూసీ ద్వారా రిపేర్లు చేయించేలా ఏపీకి చెప్పిస్తేనైనా డ్యామ్​సేఫ్టీకి చర్యలు తీసుకుంటుందన్న యోచనలో అధికారులు ఉన్నారు. గొయ్యి పడినప్పటి నుంచి ఏపీ దాన్ని పూడ్చేందుకు చర్యలు తీసుకోలేదు. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు 2014లో నేషనల్​ఓషనోగ్రఫీ ఇనిస్టిట్యూట్​ద్వారా బాతిమెట్రిక్​ సర్వే చేయించింది. గొయ్యిపడిన ప్రాంతంలో నీటి లోపలి నుంచి వీడియోలు తీశారు. 

శ్రీశైలం డ్యామ్​ఫౌండేషన్‎ను దాటి క్రాకులు పడుతున్నట్టు ఆ సర్వేలో గుర్తించారు. ఆ తర్వాత ఎన్డీఎస్ఏ చేసిన టెస్టుల్లోనూ అవే ఫలితాలు వచ్చాయి. వెంటనే మరమ్మతులు చేపట్టాలని సూచించినా ఏపీ మాత్రం కనీసం స్పందించలేదు. కృష్ణా బోర్డు మీటింగుల్లో ఎన్నిసార్లు చెప్పినా ఏపీ పెడచెవిన పెట్టింది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం డ్యామ్‎కు ప్రమాదం జరిగితే రెండు రాష్ట్రాలకు పెను నష్టం తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్న మన అధికారులే చొరవ తీసుకుని టెట్రాపాడ్స్​ఆలోచనను సీడబ్ల్యూసీకి వివరించారు. 

ఇంటర్​లాక్​ అవుతయ్​..

టెట్రాపాడ్స్‎ను ఎక్కువగా బీచ్​గట్లకు వాడుతుంటారు. తీరం కోతకు గురికాకుండా పలు చోట్ల వీటిని ఏర్పాటు చేస్తుంటారు. ముంబైలోని బీచ్‎లకు వెళ్తే ఈ టెట్రాపాడ్స్​ఎక్కువగా కనిపిస్తుంటాయి. అక్కడ రోడ్డుకు ఆనుకునే బీచులు ఉంటాయి కాబట్టి.. తీరం కోతకు గురైతే రోడ్లు, ఇతర మౌలికవసతులకు నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేశారు. ఆ టెట్రాపాడ్‎లనే ఇప్పుడు శ్రీశైలం ప్లంజ్​పూల్ గొయ్యిలో ఏర్పాటు చేస్తే ప్రమాదాన్ని నివారించొచ్చని అధికారులు చెబుతున్నారు. 

ఈ టెట్రాపాడ్స్​ఒకదానికొకటి ఇంటర్​లాక్​ అయ్యి.. స్పిల్​వే నుంచి వరద దూకినప్పుడు కోత లేదా గొయ్యి పడే ప్రమాదాన్ని నివారిస్తాయని, క్రాకులు డ్యామ్​వైపునకు మరింతగా వెళ్లకుండా నిరోధిస్తాయని ఈఎన్సీ అనిల్​కుమార్​చెప్పారు. అయితే, ఆ గొయ్యిని పూడ్చేందుకు ఆ టెట్రాపాడ్స్​ఎంత మేర అవసరమవుతాయి..? ఎంత ఖర్చవుతుందన్న దానిపై మాత్రం ఇప్పుడే నిర్ధారణకు రాలేమని చెబుతున్నారు. సీడబ్ల్యూసీ ఈ ఆలోచనను ఏపీకి చెప్పి, ఏపీ ఓకే అంటే అప్పుడు మరోసారి సర్వే చేయించి టెండర్లు పిలిచాకే దానిపై క్లారిటీ వస్తుందంటున్నారు.