
- క్వార్టర్ బాటిల్ పై రూ.15 నుంచి 20వరకు తగ్గింపు
- బోర్డర్ షాపుల్లో సేల్స్ ఢమాల్
- టెండర్ల టైంలో బోర్డర్ దుకాణాలకు పోటాపోటీ
'' ఖమ్మం జిల్లాలోని సరిహద్దు గ్రామానికి చెందిన ఒకాయన వైన్స్ షాపును డ్రాలో దక్కించుకున్నాడు. డ్రా జరిగిన రోజే సిండికేట్పెద్దలు తలుపు తట్టారు. రెండు రోజులపాటు జరిగిన బేరసారాల్లో సిండికేట్ పెద్దలు దాదాపు రూ.రెండు కోట్ల వరకు గుడ్‌విల్ ఆఫర్ చేశారు. అంతకుముందు వైన్‌షాపు నడిపిన అనుభవం లేకపోయినా సొంతంగానే నడుపుకుంటానని ఆ ఆఫర్లను రిజెక్ట్ చేశాడు. బార్డర్ షాపు కాబట్టి గిరాకీ ఎక్కువ ఉంటుందని, బాగా లాభాలు వస్తాయని ఆశపడ్డాడు. కానీ, ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. ఏపీలో లిక్కర్ రేట్లు తగ్గించడంతో క్రిస్మస్ పండుగతో పాటు వీకెండ్స్ లో కూడా గిరాకీలేదు. ఏపీ నుంచి మద్యం ప్రియులు రావడంలేదు. గుడ్‌విల్ ఇస్తానన్నప్పుడే లైసెన్స్ అమ్ముకుంటే బాగుండేదని వాపోతున్నాడు. ''
ఖమ్మం, వెలుగు: రాష్ట్రంలోని ఏపీ సరిహద్దు వైన్‌షాపులను దక్కించుకున్న వ్యాపారుల పరిస్థితి అనుకున్నదొక్కటి, అయ్యిందొక్కటి అన్నట్టుగా మారింది. ఒక్కొక్కరు రూ. లక్షలు పెట్టి సిండికేట్ అయి పెద్దసంఖ్యలో అప్లికేషన్లు వేస్తే అరకొరగా షాపులు దక్కాయి. అలా డ్రాలో వైన్ షాపులు దక్కని వారు గుడ్ విల్ ఇచ్చి మరీ బార్డర్ షాపులను దక్కించుకున్నారు. రెండేళ్లకు లైసెన్స్ఇవ్వడం, ఏడాది తర్వాత వరుసగా ఎన్నికలు జరగనుండడంతో అమ్మకాల మీద భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్ లో అక్కడి ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించడంతో సేల్స్ పడిపోయాయి. ఏపీలో బ్రాండ్ ను బట్టి ఒక్కో బాటిల్ మీద రూ.10 నుంచి రూ.150 వరకు రేట్లు తగించారు. తగ్గించిన రేట్లు ఈనెల 20 నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో బార్డర్ఏరియాల్లోని వైన్స్‌ల్లో ఈ ఐదారు రోజుల్లోనే అమ్మకాలు బాగా పడిపోయాయని ఎక్సైజ్ఆఫీసర్లు చెబుతున్నారు. ఇయర్ ఎండ్, న్యూ ఇయర్ సేల్స్ బాగా తగ్గుతాయని వారు అంటున్నారు.
బార్డర్ షాపులకు డిమాండ్
ఈసారి లిక్కర్ షాపులకు డిమాండ్ బాగా పెరిగింది. గవర్నమెంట్ కు అప్లికేషన్ల ఫీజు ద్వారానే రూ.1,357 కోట్ల రాబడి వచ్చింది. గత నెలలో 2,620 షాపులకు టెండర్లు నిర్వహించగా, 67,849 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఖమ్మం జిల్లాలోని 122 షాపులకు స్టేట్‌లోనే ఎక్కువగా 6,212 అప్లికేషన్లు వచ్చాయి. ఏపీ బార్డర్‌లోని షాపులకున్న డిమాండే ఇందుకు కారణం. ఈ షాపులను దక్కించుకునేందుకు ఏపీకి చెందిన వ్యాపారులు కూడా టెండర్లలో పాల్గొన్నారు. డ్రాలో షాపులలు రాకపోయినా బార్డర్ దుకాణాలను ఎక్కువ గుడ్ విల్ ఇచ్చి మరీ చేజిక్కించుకున్నారు. ముదిగొండ, ఎర్రుపాలెం మండలాల్లోని షాపులకు రూ.కోటికి పైగా గుడ్ విల్ ఇచ్చి మద్యం సిండికేట్లు కొనుక్కున్నాయని టాక్ ఉంది.
తగ్గిన సేల్స్
రాష్ట్రంలో డిసెంబర్ 1 నుంచి కొత్త షాపులు ప్రారంభమయ్యాయి. ప్రతి షాపులో మినిమమ్ స్టాక్ఉండేలా కనీసం రూ.20 లక్షల విలువైన మద్యాన్ని అందుబాటులో ఉంచుకుంటారు. తర్వాత ప్రతి వారం సేల్స్ కు తగట్టు స్టాక్ తెప్పించుకుంటారు. పండుగలు, ఇయర్ ఎండ్ లాంటి అకేషన్స్ లో సేల్స్ఎక్కువగా ఉంటాయని స్టాక్ కూడా ఎక్కువ తెప్పిస్తారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోవడంతో గతేడాదితో పోలిస్తే ఇప్పటి వరకు కనీసం 15 శాతం తక్కువ స్టాక్ తెప్పించినట్టు చెబుతున్నారు. వచ్చే నెలలో స్టాక్మరింత తగ్గవచ్చునని అంటున్నారు.
అటు నుంచి లిక్కర్ రావచ్చన్న డౌట్స్
ఏపీలో మొన్నటి దాకా లిక్కర్ రేట్లు ఎక్కువ ఉండడంతో అక్కడి నుంచి చాలామంది మన స్టేట్‌కు వచ్చి తాగేవారు. కొందరు అక్రమంగా లిక్కర్‌ను బార్డర్ దాటించి అక్కడ అమ్ముకునేవారు. దీంతో ఈ మండలాల్లోని వైన్స్‌ల్లో అమ్మకాలు భారీగా ఉండేవి. బెల్టు షాపులకు కూడా గిరాకీ జోరుగా ఉండేది. దీంతో జిల్లా ఎక్సైజ్ ఆఫీసర్ల టార్గెట్ కంటే 35 శాతం వరకు ఎక్కువ సేల్స్ ఉండేవి. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఏపీలో రేట్లు తగ్గడంతో ఎవరూ ఇక్కడ నుంచి లిక్కర్ తరలించడంలేదు. పైగా ఏపీ నుంచే లిక్కర్ తెలంగాణకు తరలిస్తారేమోనని ఎక్సైజ్ సిబ్బంది, వ్యాపారులు అనుమానిస్తున్నారు. దీంతో సరిహద్దు షాపుల్లో మద్యం అమ్మకాలు పడిపోకుండా ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు. మన రాష్ట్రంలో లిక్కర్ టెండర్ల ప్రక్రియ ముగిసిన 15 రోజుల తర్వాత ఏపీలో ట్యాక్స్ లు తగ్గించారు. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ పై 5 నుంచి 12 శాతం వరకు, అన్ని కేటగిరీల మద్యంపై 20 శాతం వరకు రేటు ను తగ్గించారు. లిక్కర్ అక్రమ రవాణాను, నాటు సారా తయారీని అరికట్టేందుకు రేట్లు తగ్గించినట్టు ఏపీ సర్కారు ప్రకటించింది. దీంతో బ్రాండ్ ను బట్టి క్వార్టర్ పై రూ.10 నుంచి రూ.30 వరకు, ఫుల్ బాటిల్ పై రూ.100 నుంచి 120 వరకు మన రాష్ట్రంలో కంటే ఏపీ లిక్కర్ రేట్లు తగ్గిపోయాయి.