![ఏపీలో మద్యం ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన మద్యం ధరలు.. ఒకేసారి ఇంత పెంచారేంటి..?](https://static.v6velugu.com/uploads/2025/02/andhra-pradesh-govt-hikes-liquor-prices-by-20-percent_JN5HmnZ4Wr.jpg)
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మద్యం ప్రియులకు కూటమి ప్రభుత్వం షాకిచ్చింది. ఏపీలో మద్యం ధరలను 15 శాతం పెంచుతూ ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుంది. కేబినెట్ నిర్ణయం మేరకు మద్యం ధరల పెంపుపై ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. బీర్లు, 99 రూపాయలకు ప్రస్తుతం అమ్ముతున్న క్వార్టర్పై తప్ప మిగిలిన లిక్కర్ ధరలు భారీగా పెరగనున్నాయి. ఏపీలో మద్యం అమ్మకాలపై మార్జిన్‌ను ప్రభుత్వం ఇటీవల 14.5 నుంచి 20 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. దీంతో అన్ని కేటగిరీల్లో 15 శాతం ధరలు పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ ప్రభుత్వం అక్టోబర్లో కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే క్రమంగా తెలంగాణ బార్డర్ షాపులపై ఎఫెక్ట్ పడింది. ఏపీలో బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి రావడం, తెలంగాణతో పోలిస్తే ధరలో కూడా పెద్దగా తేడా లేకపోవడం, కొన్ని బ్రాండ్లు మనకంటే అక్కడే తక్కువ ధరకు దొరుకుతుండడంతో ఏపీ, తెలంగాణ సరిహద్దులో ఉన్న తెలంగాణ వైన్స్లో సేల్స్ తగ్గిపోయాయి.
ALSO READ | వెరీ షాకింగ్ : జగన్ ఇచ్చిన ఇంటి స్థలాలు వెనక్కి తీసుకోనున్న చంద్రబాబు ప్రభుత్వం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధికంగా అమ్ముడయ్యే బ్రాందీ క్వార్టర్ బాటిల్ రూ.130 ఉండగా, ఇదే బ్రాండ్ ఏపీలో రూ.120కే అమ్ముతున్నారు. ఇక చీప్ లిక్కర్ ను రూ.99కే క్వార్టర్ బాటిల్ను కూడా అందుబాటులోకి తెచ్చారు. దీంతో గతేడాది వరకు ఎప్పుడూ జాతరను తలపించేలా ఉండే ఎర్రుపాలెం వైన్ షాప్ దగ్గర ప్రస్తుతం రష్ బాగా తగ్గిపోయిందని ఎక్సైజ్ ఆఫీసర్లే ఆఫ్ ది రికార్డుగా చెప్తున్న పరిస్థితి. ఏపీ ప్రభుత్వం తాజాగా మద్యం ధరల పెంపు నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణ బార్డర్ షాపుల్లో మద్యం అమ్మకాలు జోరందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.