
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించిన నియమ నిబంధనలు మారుస్తూ ఏపీ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ కు రాష్ట్ర గవర్నర్ ఆమెదముద్ర వేశారు. దీంతో ప్రభుత్వం వెంటనే ఆ మేరకు జీవో జారీ చేసింది. ఈ జీవోతో ప్రభుత్వానికి సంక్రమించిన అధికారంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రమేష్ కుమార్ ను తొలగిస్తూ ఏపీ సర్కార్ జీవో జారీ చేసింది.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఈసీ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని గతంలో ఏపీ ప్రభుత్వం తప్పుపట్టింది. దీనిపై సుప్రీం కోర్టుకు కూడా వెళ్లింది. అయితే, కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు వాయిదా వేసినట్టు గతంలోనే ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత కొన్ని రోజుల క్రితం తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని రమేష్ కుమార్ చెప్పిన సంగతి తెలిసిందే.