- ఫలితమివ్వని పునరావాస పథకం
- అక్కడి నుంచే తెలంగాణాలోకి రవాణా
- నిరోధించలేకపోతోన్న ఆఫీసర్లు
- బోర్డర్ సమస్యతో ఆబ్కారీశాఖకు తలనొప్పులు
భద్రాచలం, వెలుగు: రాష్ట్రంలో గుడుంబా తయారీ, అమ్మకాలు నిరోధించేందుకు తెచ్చిన పునరావాస పథకం ఫలితాన్ని ఇవ్వడంలేదు. సరిహద్దునే ఉన్న ఆంధ్రాలో గుడుంబా తయారీ జోరుగా సాగుతుండడంతోపాటు అక్రమ రవాణా కూడా అధికంగా ఉండడంతో పునరావాస పథకం ద్వారా సరైన లబ్ధి లేకపోవడంతో తిరిగి పాత జీవితానికే మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్వరకు భద్రాచలం ఆబ్కారీ సర్కిల్ పరిధిలో 110కిపైగా గుడుంబా అక్రమ రవాణా, తయారీ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత రెండు నెలల్లో కూడా మరిన్ని కేసులు నమోదైనట్లు తెలిసింది.
గుడుంబా తయారు చేసి, అమ్మేవారి కోసమే ఈ పునరావాస పథకాన్ని ప్రభుత్వం 2017 అక్టోబర్28న ప్రవేశ పెట్టింది. వారికి ప్రత్యామ్నాయంగా ఉపాధి చూపిస్తామని హామీ ఇచ్చింది. అందుకనుగుణంగానే భద్రాచలం మన్యం ప్రాంతంలోని భద్రాచలం, బూర్గంపాడు, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో 62 మందిని గుర్తించారు. వారికి తలా రూ.2లక్షలతో వారికి నచ్చిన ఉపాధిని కల్పించారు. పునరావాస పథకం ద్వారా లబ్ధి పొందినవారే తిరిగి గుడుంబా తయారీ, అమ్మకాల్లో బిజీ అయిపోయారు. దీంతో పునరావాస పథకం పనికి రాకుండాపోతోందని ఆబ్కారీ శాఖ ఆఫీసర్లు, సిబ్బందిలో వ్యక్తమవుతోంది. తమకు ప్రధానంగా ఆంధ్రా బోర్డర్తోనే సమస్య వస్తోందని వారంటున్నారు.
సిబ్బంది లేక ఆబ్కారీశాఖలో ఇబ్బందులు..
భద్రాచలం మన్యం ప్రాంతంతోపాటు ఆంధ్రాలోనూ గుడుంబా తయారీ, అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. ఎక్కువ మొత్తంలో అక్కడ తయారు చేసి భద్రాచలానికి తెచ్చి అమ్ముతున్నారు. దీన్ని అరికట్టాల్సిన ఆబ్కారీ శాఖ అధికారులు విఫలం అవుతున్నారు. 11 మంది ఉండాల్సిన స్టాఫ్కు గాను ఐదుగురితోనే నెట్టుకొస్తున్నారు. ఎంత నియంత్రించాలనుకున్నా వారితో కావడం లేదు. గతంలో పునరావాస పథకం ద్వారా సర్కారు నుంచి రూ.2లక్షల సాయం అందుకున్నవారు కూడా మళ్లీ పాతబాటనే పడుతున్నారు. తిరిగి గుడుంబా అమ్మకాల వైపు మొగ్గుచూపుతున్నారు.
బతిమిలాడినా...హెచ్చరించినా
గతంలో పునరావాసం ద్వారా లబ్ధిపొందిన వారి యూనిట్లు ఇప్పుడు ఎక్కడా లేవు. కానీ వారిలో చాలా మంది మళ్లీ పాత జీవితాన్నే మొదలెట్టారు. ఇలా బతిమిలాడినా ఫలితం లేకపోవడంతో వారిపై ఉక్కుపాదం మోపాలని ఆఫీసర్లు చూశారు. ఒకసారి దొరికితే బైండోవర్, రెండోసారి అదే కేసు నమోదైతే రూ.లక్ష జరిమానా విధిస్తామని హెచ్చరించారు. సర్కిల్ పరిధిలోని ఒక్కో మండలంలో ఒక్కొక్కరికి ఇలాంటి శిక్షలే వేశారు. అయినా వారిలో మార్పు రావడం లేదు. గుడుంబా తయారీ, అమ్మకాలు ఆగడం లేదు.
దుమ్ముగూడెం మండలంలోని బండిరేవు, పెద్ద నల్లబల్లి, చిన్ననల్లబల్లి, రేగుబల్లి, లక్ష్మీనగరం, అచ్యుతాపురం, సుజ్ఞానపురం,భద్రాచలం, చర్ల మండలంలోని కందిపాడు వంటి తదితర అన్ని గ్రామాల్లో, బూర్గంపాడు మండలంలోని సారపాక, బూర్గంపాడు, లక్ష్మీపురంలలో గుడుంబా ఏరులై పారుతోంది. దీనికి తోడు భద్రాచలం సరిహద్దున ఉన్న ఆంధ్రాలో విలీనమైన ఏటపాక మండలం పిచ్చుకులపాడు నుంచి నిత్యం భద్రాచలంకు గుడుంబా భారీగా వస్తోంది.
తూతూమంత్రంగా ఉంటే అంతే..
పునరావాస పథకం తూతూమంత్రంగా జరిగింది. ఊరిలో 20 మంది ఉంటే కేవలం ఒకరిద్దరికే సాయం చేసి చేతులు దులుపుకుంటే మిగిలిన వాళ్లు గుడుంబా తయారు చేసి అమ్ముతున్నరు. గంజాయి, గుడుంబా నియంత్రణ కమిటీలు ఏర్పాటు చేసిన్రు. కానీ ప్రభుత్వం ఇంకొంచెం ప్రయత్నిస్తే మార్పు వస్తుంది. మార్పు రావాలంటే పునరావాస పథకాలను గ్రామాలకు విస్తరించాలి.
- నీలిప్రకాశ్, ఎన్జీవో, చర్ల
ఇబ్బందులున్నా అడ్డుకుంటున్నం..
గుడుంబా నిరోధానికి బోర్డర్ సమస్యలున్నా అడ్డుకుంటున్నాం. పునరావాస పథకం ద్వారా తయారీ, అమ్మకాల నియంత్రణకు ప్రయత్నించాం. అయినా కొందరు ఇంకా అమ్ముతూనే ఉన్నారు. వారిని గుర్తించి వారిపై కేసులు కూడా పెట్టాం. తయారు చేసే గ్రామాలపై దృష్టి పెట్టి నిత్యం రైడింగ్స్ చేస్తున్నాం. -రహీమున్నీసాబేగం, ఆబ్కారీ సీఐ, భద్రాచలం