- ట్రాఫిక్ చలాన్లు కట్టనొళ్ల ఇండ్లకు కరెంట్, నీళ్లు ఆపేయండి
- హెల్మెట్ ధరించకుంటే కఠిన చర్యలు తీసుకోండి: ఏపీ హైకోర్టు
- తెలంగాణలో వాహనదారులు రూల్స్ పాటిస్తారని ప్రశంస
హైదరాబాద్, వెలుగు: ఏపీలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయని దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఆ రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ట్రాఫిక్ చలాన్లు కట్టని వాళ్ల ఇండ్లకు కరెంట్ సప్లై కట్ చేయడంతోపాటు నీటి సరఫరాను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది. రాష్ట్రంలో హెల్మెట్ ధరించని బైకర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కేంద్ర మోటార్ వాహన సవరణ చట్టం ప్రకారం రూల్స్ అమలు చేయకపోవడంతో రోడ్డు ప్రమాదాలు పెరిగాయని పేర్కొంటూ అడ్వకేట్ తాండవ యోగేశ్ ఇటీవల పిల్ వేశారు. దాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవి గురువారం విచారించారు.
హెల్మెట్ ధరించకపోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 3 నెలల్లోనే 667 మంది చనిపోవడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘తెలంగాణలో వాహనదారులు నిబంధనలు పాటిస్తారు. ఏపీలో మాత్రం పాటించట్లేదు. ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాల డ్రైవర్లు తెలంగాణ సరిహద్దుకు వెళ్లగానే సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నారు. అదే ఆంధ్రాలో ఎవరూ సీటు బెల్టులు పెట్టుకోవడం లేదు. ప్రస్తుతం విధిస్తున్న జరిమానాలనే కఠినంగా వసూలు చేస్తే నిబంధలు పాటిస్తారని” అని హైకోర్టు పేర్కొంది. అనంతరం విచారణను వాయిదా వేసింది.