ఏపీలో పొలిటికల్ లీడర్లు యాక్టివ్ అయ్యారు. ఎన్నికలకు 18నెలల సమయం ఉన్నా.. అందరూ నేతలు గ్రౌండ్ లోకి దిగుతున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో..కాంగ్రెస్ కార్యకర్తలు హుషారుగా ఉన్నారు. మరోవైపు మూడు రోజుల పర్యటన కోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీకొచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఎంపీ రాహుల్ గాంధీ హామీనిచ్చారు. ఏపీకి రాజధానిగా అమరావతే ఉంటుందన్నారు. విభజన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. APలో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో భాగంగా కర్నూల్ జిల్లాలో పర్యటిస్తున్నారు.
ఇవాళ ఉదయం ఆదోని మండలం చాగి గ్రామం నుంచి మొదలైన యాత్ర.... ఎమ్మిగనూరు మండలం బనవాసి వరకు కొనసాగింది. రాత్రి అక్కడే బస చేశారు. మహిళా, శిశు సంక్షేమ శాఖపై AP సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు ఆఫీసులో జరిగిన సమావేశంలో అంగన్ వాడీలపై రివ్యూ చేశారు. బాలింతలు, గర్భవతుల్లో రక్తహీనత, చిన్నారుల్లో పౌష్టికాహార లోపం నివారించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆ తర్వాత బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమయ్యారు. 19 నెలల్లో ఎన్నికలు ఉన్న సందర్భంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు.
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఏపీ ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. పల్నాడు జిల్లా తిమ్మాపురం, నాదెండ్ల మండలాల పరిధిలోని అకాల వర్షాలతో దెబ్బతిన్న పత్తి, మిరప పంటలను పరిశీలించారు. కష్టాల్లో ఉన్న రైతులకు అండగా ఉండాల్సిన సీఎం తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నారని విమర్శించారు.
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లారు. గత కొన్ని రోజులుగా ఏపీ పర్యటనలో ఉన్న జనసేనాని ఇవాళ హైదరాబాద్ వచ్చారు. బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి... ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన వెంట నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీకొచ్చారు. ఇవాళ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు.