= కిరాయి చెల్లిస్తుందా..? దఫ్తర్లు ఖాళీ చేస్తదా..?
= జూన్ 2తో ముగియనున్న ‘ఉమ్మడి’ గడువు
= హైదరాబాద్ లో ఇంకా కొనసాగుతున్న ఏపీ ఆఫీసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై జూన్ 2వ తేదీతో పదేళ్లు పూర్తవుతుంది. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ తెలంగాణకు మాత్రమే పరిమితమవుతుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఇక్కడ కొనసాగుతున్న ఆఫీసులు, గెస్ట్ హౌస్ లు ఖాళీ చేయాల్సి ఉంటుంది. లేదంటే కిరాయిలు కట్టాల్సిందే. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం, సమైక్య ఏపీ విభజన జరిగిన 10 ఏళ్ల తర్వాత, అవశేష రాష్ట్రం ఏపీ తన ఆధీనంలో ఉన్న భవనాలను, హైదరాబాద్‌లోని లేక్ వ్యూ గెస్ట్‌హౌస్‌ను కూడా ఖాళీ చేసి తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలి. అంటే జూన్ 2 లోపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అయితే ఖాళీ చేయడమా..? లేకుండా కిరాయిలు కట్టడమా అనే డెసిషన్ తీసుకొని యాక్షన్ లో పెట్టాలి. గడువు ముగిసే నాటికి ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరదు. జూన్ 4వ తేదీన అక్కడి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. దీంతో ఏం జరుగబోతోందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం లేక్ వ్యూ అతిథి గృహం, లక్డీకాపూల్ లోని సీఐడీ ఆఫీసు, ఆదర్శ్ నగర్ లోని హెర్మిటేజ్ భవనం ఏపీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. వీటిని ఖాళీ చేయడానికి మరో ఏడాది పాటు గడువు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ సర్కారును అభ్యర్థించింది. దీనిని తెలంగాణ సర్కారు తిరస్కరించినట్టు సమాచారం. అయితే అద్దె ప్రాతిపదికన ఏడాది పాటు వినియోగించుకునేందుకు అవకాశం ఇస్తుందని తెలుస్తోంది.
Also Read:వివేకం సినిమాకు ఈసీ షాక్
2016లో తరలిన పలు ఆఫీసులు
2016లో అప్పగి ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించారు. పలు విభాగాలను, శాఖల కార్యాలయాలను అక్కడికి మార్చారు. ఏడాది పాటు ఈ తరలింపు ప్రక్రియ కొనసాగింది. 2019లో ఏపీ ప్రభుత్వం కొన్ని భవనాలను తెలంగాణ సర్కారుకు అప్పగించింది. అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ గా ఉన్న నరసింహన్ ఈ భవనాలను ఆస్తిపన్ను నుంచి మినహాయించాలని తెలంగాణ సర్కారుకు సూచించారు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్, సీఐడీ ఆఫీసు, హెర్మిటేజ్ భవనాలను అవసరాల కోసం ఏపీ ప్రభుత్వం వినియోగించుకుంటుందని చెప్పారు. అప్పటి ప్రభుత్వం అంగీకరిచింది. ప్రస్తుతం గడువు ముగిసినందున ఈ మూడు భవనాలను ఏపీ ప్రభుత్వం ఖాళీ చేస్తుందా..? లేక అద్దె చెల్లిస్తుందా..? అనేది ఆసక్తికరంగా మారింది.