AP Election 2024: ఏపీలో ముగిసిన పోలింగ్ ప్రక్రియ ...- చెదురు మదురు ఘటనల మినహా ప్రశాంతం

ఏపీలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. పలుచోట్ల చెదురుమదురు ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. సాయంత్రం 6 గంటల వరకూ 75 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 74 శాతం నమోదు కాగా.. అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 55 శాతం ఓటింగ్ నమోదైంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు క్యూలైన్లలో ఓటు వేసేందుకు నిల్చున్నారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకు, సమస్యాత్మక ప్రాంతాల్లో 5 గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగియగా.. మిగిలిన నియోజకవర్గాల్లో 6 గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. 6 గంటల్లోపు క్యూలైన్లలో ఉన్న వారిని ఓటు వేసేందుకు ఎన్నికల సిబ్బంది అనుమతిస్తున్నారు. గత ఎన్నికల్లో 79.08 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి పోలింగ్ పెరిగే అవకాశం ఉందని ఎన్నికల సంఘం అంచనా వేస్తోంది. చివరి గంటల్లో పోలింగ్ ఊపందుకుంది.

విజయవాడ పోరంకిలో తీవ్ర ఉద్రిక్తత: విజయవాడలోని పోరంకి పోలింగ్ కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ నెలకొనగా.. ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో దాడులకు దిగారు. టీడీపీ తీరుపై వైసీపీ అభ్యర్థి జోగి రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులకు దిగే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కావలిలో ఉద్రిక్త పరిస్థితి: నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరు మండలం బీరంగుంటలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీడీపీకి ఏకపక్షంగా ఓట్లు పడుతున్నాయనే అనుమానంతో ఏఎంసీ మాజీ ఛైర్మన్ సుకుమార్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. అనుచరులతో వచ్చిన ఆయన.. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడికి దిగారు.

ఏపీలో పలుచోట్ల ఉద్రిక్తతలు:ఏపీలో పోలింగ్ సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. నరసరావుపేట పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ శ్రేణులు హల్చల్ చేశారు. ఓటర్లపై దాడికి యత్నించగా.. వారు భయాందోళనకు గురై పరుగులు తీశారు. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడికి యత్నించగా.. టీడీపీ నేతలు తిప్పికొట్టారు.