బంగాళాఖాతంలోని అల్ప పీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం చెన్నై సిటీకి 360 కిలోమీటర్లు.. పుదుచ్చేరికి 400 కిలోమీటర్లు.. నెల్లూరు టౌన్ కు 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యి ఉంది. ఇది గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొస్తుంది. ఈ లెక్కన ఈ వాయుగుండం.. 2024, అక్టోబర్ 17వ తేదీ తెల్లవారుజామున చెన్నై సిటీ సమీపంలో.. పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
ఈ వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే ఏపీలోని ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. రాయలసీమలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. గుంటూరు, కృష్ణా జిల్లాలతోపాటు తెలంగాణలోనూ మోస్తరు నుంచి భారీ వానలు పడుతున్నాయి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఉమ్మడి జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. సహాయ చర్యల్లో ఇప్పటికే అధికారులు, సిబ్బంది నిమగ్నం అయ్యారు. అత్యవసరం అయితేనే ప్రయాణాలు పెట్టుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. రాబోయే రెండు, మూడు రోజులు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ.
Also Read:-అక్కడక్కడ దంచి కొడుతున్న వర్షం
వాయుగుండం ప్రభావంతో.. ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం ఓడరేవులో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు రోజువారీ కంటే 2 అడుగులు ఎత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రం పోటుపై ఉంది. ముందుకు చొచ్చుకువచ్చింది. దీంతో కొత్తపట్నం పరిసర ప్రాంతాల్లో.. తీరం వెంట ఉండే ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. సహాయ చర్యల్లో భాగంగా ఇప్పటికే NDRF బృందాలు జిల్లాకు చేరుకున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. తీరం వెంట గాలులు వీస్తున్నాయి. వీటి వేగం 50 నుంచి 60 కిలోమీటర్లుగా ఉంది.