సీఎం క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
జెండా ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం జగన్
అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ..
త్యాగాలను ఘనంగా స్మరించుకునే పండుగ రోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం: సీఎం జగన్
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఇవాళ ఘనంగా జరిగాయి. అన్ని జిల్లా్ల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించగా.. క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం పోలీసుల గౌరవవందనం స్వీకరించారు.
రాష్ట్ర విభజన అనంతరం వేడుకలు జరుపుకోని విషయం తెలిసిందే. జగన్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవాలని నిర్ణయించి.. ఏటా నవంబర్ 1నే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించే ఆనవాయితీని పునః ప్రారంభించారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు తదితర అధికారులు పాల్గొన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహానికి సీఎం జగన్ పూలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో శాసన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్ జకియా ఖానం, హోంశాఖ మంత్రి తానేటి వనిత, పర్యాటకశాఖ మంత్రి ఆర్ కే రోజా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి, తెలుగు, సంస్కృత అకాడమీ ఛైర్ పర్సన్ ఎన్ లక్ష్మీపార్వతి ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ ట్వీట్
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి జగన్ ట్వీట్ చేశారు. ‘‘మన సంస్కృతిని- మన కీర్తిని, మన పూర్వీకుల పోరాటాలను- విజయాలను, ఈ నేల పై జన్మించిన ఎందరో మహానుభావుల త్యాగాలను ఘనంగా స్మరించుకునే పండుగ రోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ.. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమవుదాం..’’ అంటూ జగన్ పిలుపునిచ్చారు.