ఏపీ టెన్త్ రిజల్ట్స్ వచ్చాయి. విజయవాడలో మంత్రి బొత్స సత్యనారయణ ఫలితాలను వెల్లడించారు. ఈ ఏడాది మొత్తం 72.26 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో బాలురు 69.27 శాతం, బాలికలు 75.38 శాతం ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది కంటే ఈ సారి 5 శాతం ఉత్తీర్ణత శాతం పెరిగినట్లుగా మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 3.47 శాతం ఉత్తీర్ణత పెరిగింది. ఈ ఏడాది కూడా బాలురు కంటే బాలికలే పై చేయి సాధించినట్లుగా ఆయన తెలిపారు. బాలురు కంటే బాలికలు 6.11 శాతం ఎక్కువ ఉత్తీర్ణత సాధించారు.
టెన్త్ ఫలితాల్లో 87.47 శాతంతో పార్వతీపురం మన్యం జిల్లా ఫస్ట్ ప్లేస్ లో నిలవగా, చివరి స్థానంలో నంద్యా ల జిల్లా నిలిచింది. 933 స్కూళ్లలో 100 శాతం ఫలితాలు సాధించారు. 38 స్కూళ్లలో సున్నా ఫలితాలు వచ్చాయి. జూన్ 2 నుంచి సప్లమెంటరీ పరీక్షలు ఉంటాయని మంత్రి బొత్స సత్యనారయణ వెల్లడించారు. సప్లమెంటరీ పరీక్షల కోసం ఈ నెల 17 వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఫెయిలైన విద్యార్థులు క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. మే 13 వరకు రీకౌంటింగ్, రీ వెరిఫీకేషన్ కు అవకాశం కల్పించారు.
రాష్ట్రవ్యాప్తంగా 3 వేల 349 కేంద్రాల్లో ఏప్రిల్ 03 నుంచి 18 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించగా. ఏప్రిల్ 19 నుంచి 26 వరకు స్పాట్ వ్యాల్యూయేషన్ పూర్తి చేశారు. మొత్తం టెన్త్ పరీక్షలకు 6 లక్షల 40 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వీరిలో 6, 05,052 మంది పరీక్షలకు హాజరయ్యారు.