
ఆంధ్రుల చరిత్రలో నాణాలను ముద్రించిన మొదటి రాజులు శాతవాహనులు. గౌతమిపుత్ర శాతకర్ణి కాలం నుంచి నాణాలపైన ప్రాకృతంతోపాటు దేశీ భాష స్పష్టంగా కనిపిస్తుంది. గుణాఢ్యుడు రచించిన బృహత్కథలో కూడా దేశీ భాష కనిపిస్తుంది. దేశీ భాష నుంచే తెలుగు భాష ఆవిర్భవించిందని చరిత్రకారుడు దినేశ్ చంద్ర సర్కార్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
శాతవాహనుల నాణాలు నెవాసా, మస్కి, త్రిపూరి, నాగార్జునకొండ, కొండాపూర్, పెద్దబంకూర్ మొదలైన చోట్ల లభించాయి. వీరి కాయిన్స్ రాగి, సీసంతో నాణాల మిశ్రమం. వీటిని పోటిన్ నాణాలు లేదా పునర్ముద్రిత నాణాలు అంటారు.
పునర్ముద్రిత నాణాలు గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించినవి. ఇవి నహపాణుడి నాణాలపై తిరిగి ముద్రించాడు. ఇవి మహారాష్ట్రలోని జోగల్తంబి వద్ద 9270 వెండి నాణాలు లభించాయి. నహపాణున్ని యుద్ధంలో పరాజితుణ్ని చేసిన తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణి అతని నాణేలను పునర్ముద్రింపజేశాడని పండితుల అభిప్రాయం. కుప్పగా పోసి ఉన్న శ్రీముఖుడికి సంబంధించిన నాణాలు జగిత్యాల జిల్లాలోని కోటిలింగాల వద్ద లభించాయి.
రోమన్ల బంగారు నాణాలపై రాజు ముఖాన్ని ముద్రణ చేసిన తొలి శాతవాహన రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి. నౌకబొమ్మ (తెరచాప) గుర్తు గల నాణాలను యజ్ఞశ్రీ శాతకర్ణి ముద్రించాడు. ఇవి శాతవాహనుల కాలంలో జరిగిన సముద్ర వ్యాపారం గురించి తెలియజేస్తున్నాయి. వీరి నాణాలపై ఎద్దు, ఏనుగు, సింహం, స్వస్తిక్, ఉజ్జయిని తోరణం వంటి చిహ్నాలు ఉంటాయి. నాలుగు వైపుల వృత్తాలు ఉండి మధ్యలో శిలువ లాంటి గుర్తు ముద్రించిన నాణాలు ఎక్కువ సంఖ్యలో ఉజ్జయిని పట్టణంలో లభించినందువల్ల ఆ గుర్తును ఉజ్జయిని చిహ్నాం అని పేరు పెట్టారు.
ఉజ్జయిని పట్టణ గుర్తుగల నాణాలను మొదటి శాతకర్ణి, గౌతమిపుత్ర శాతకర్ణి వేయించారు. సూర్యాపేట జిల్లాలోని ఫణిగిరి బౌద్ధ క్షేత్రంలో రెండో రుద్రసేనుని నాణాలు లభించాయి. వీరి నాణాల మీద రాజు పేరు, తల్లి పేరు, తండ్రి పేరుతోపాటు వృషభం, ఏనుగు, సింహం, కొండ, ఓడ, సూర్యుడు, చంద్రుడు, కమలం, శంఖం మొదలైన చిహ్నాలు ఉన్నాయి.
శాతవాహనులకు పూర్వం పాలించిన స్థానిక రాజులైన గోబద, సిరినారన, కంవాయ, సరిసమగోప మొదలైన రాజుల నాణాలు కూడా కోటిలింగాల వద్ద లభ్యమయ్యాయి. కొండాపూర్లో శాతవాహనులకు సంబంధించిన నాణాలు సుమారుగా 4000 లభించాయి. అందుకే కొండాపూర్ను శాతవాహనుల టంకశాల నగరం అని, మల్లంపల్లి సోమశేఖరశర్మ వ్యాఖ్యానించాడు.