మణిపూర్ రాజధాని ఇంపాల్కి తూర్పున పాతిక కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆండ్రో. ఇక్కడ అడుగుపెట్టాక మొదట చూడాల్సింది ఒక స్పెషల్ గుడిసెని. మోకాళ్ల మీద ఒక మనిషి కూర్చుని సూర్యుడిని ఆరాధిస్తున్నట్టు ఉంటుంది. అంతేకాదు గుడిసె తూర్పు దిక్కుకి ఉంటుంది. గుడిసె నీడను బట్టి టైం తెలుసుకునేవాళ్లట పూర్వీకులు. మాంగాంగ్ అనే ఫ్యామిలీ ఇప్పటికీ గుడిసె బాగోగుల్ని చూసుకుంటోంది.
చెక్క స్తంభాల్లో చరిత్ర
కల్చరల్ హెరిటేజ్ కాంప్లెక్స్ ఒకటి ఉంది. దీన్ని1993లో కట్టారు. అక్కడి ప్రజల కల్చర్, ట్రెడిషన్‌కి సంబంధించిన విషయాలు ఎన్నో ఉంటాయి ఇక్కడ. వేరు వేరు డిజైన్లతో కట్టిన రకరకాల ఇండ్లు ఆకట్టుకుంటాయి. అలాగే ఊరి వాళ్లు రోజూ వాడే కుండలు, పాత్రలు, పనిముట్లు వంటివి ఉంటాయి. శతాబ్దాల నాటి మణిపురి నాణేలను కూడా అక్కడ చూడొచ్చు. ఇక్కడ మెగాలిత్స్ అంటే... చెక్కపై చెక్కిన పొడవాటి స్తంభాలు కనిపిస్తాయి. ఊరి మధ్యలో కూడా చెక్క స్తంభం ఒకటి ఉంటుంది. దాన్ని సాంస్కృతిక సమైక్యతా స్తంభం అంటారు. వాటిలో సంస్కృతి, చరిత్ర గురించి చెక్కిన బొమ్మలు చూడొచ్చు. అవి గమనిస్తే ఆ ఊరి గురించిన విషయాలు చాలా తెలుసుకోవచ్చు.
గుడిలో ఆరని మంట
అక్కడ ఉన్న ఒక పురాతన ఆలయంలో పనం నింగ్‌థౌ అనే దైవం ఉన్నట్టు నమ్ముతారు. వెయ్యేండ్ల కిందట ఆ గుడిలో హోమం వెలిగించారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు ఆ గుడిలో ప్రతిరోజూ హోమం వెలుగుతూనే ఉంటుంది. ప్రతి రోజూ గ్రామ పెద్దతో పాటు రెండు కుటుంబాలు హోమం వెలిగించే బాధ్యత తీసుకుంటాయి. అలా ఆ ఊరి వాళ్లందరికీ ఏడాది పొడవునా హోమం వెలిగించే అవకాశం వస్తుంది. ఈ ఆచారం క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో మొదలైంది. ఖుమాన్ వంశానికి చెందిన రాజు పొయిరెయిటన్ మొదటిసారి హోమం వెలిగించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ హోమం వెలుగుతూనే ఉందని చెప్తారు ఆ ఊరివాళ్లు. హోమం ఆరిపోతే కీడు జరుగుతుందని నమ్ముతారు. అందుకే దాన్ని ఆరనీయరు వాళ్లు. ఆ గుడిలో సాంస్కృతిక వేడుకలు బాగా జరుగుతాయి. వేడుకలప్పుడు రకరకాల వాయిద్యాలు వాడతారు. ఆ గుడిలోకి ఆ ఊరి వాళ్లు మాత్రమే వెళ్తారు. బయటి నుంచి వచ్చిన వాళ్లు గుడిలోపలికి వెళ్లాలనుకుంటే ఒక నియమం పాటించాలి. ఆకుల్ని నీళ్లలో ముంచి బయటి ఊరి వ్యక్తుల మీద చల్లుతారు. ఆ తర్వాతే గుడి లోపలికి వెళ్లేందుకు అనుమతిస్తారు. ఈ గుడిలో ఫొటోలు తీయడం నిషిద్ధం.
...వాళ్లు కుండలు చేయరు
చరాయి తాబా లేదా కాయిల్ పాటరీ పద్ధతిలో కుండలు తయారుచేస్తారు. కుండలు చేయాలంటే చక్రం లేదా మెషినరీ వాడతారు. కానీ, ఆండ్రో ఊరి వాళ్లు మాత్రం చేత్తోనే కుండలు చేస్తారు. కావాల్సిన సైజ్, ఆకారాల్లో తయారుచేస్తారు. కుండ చేశాక సంప్రదాయ డిజైన్ ఉన్న చెక్క బ్యాట్‌తో కొడుతూ కుండ తయారుచేస్తారు. దీని వెనక కూడా ఒక కథ ఉంది. దేవుడు, మనిషి కలిసి జీవిస్తున్న రోజుల్లో... ఆవుల మందని చూసిన ఒక మనిషి వాళ్ల అమ్మ దగ్గరకి వెళ్లి ‘ఇండియన్ రొడెండ్రాన్ (గన్నేరు) అనే మొక్క గింజలను పోలిన కుండ తయారుచేసి ఇవ్వమ’ని అడుగుతాడు. అలా కుండ తయారుచేయడం మొదలై.. అదే ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే పెండ్లి కాని వాళ్లు కుండలు తయారుచేయకూడదు అనే ఆచారం ఉంది. పెండ్లి అయ్యాక ‘థౌ చన్బా’ అనే వేడుక చేస్తారు. ఆ తర్వాతే కుండలు తయారుచేయడం నేర్చుకోవాలి.
రైస్ వైన్ ఈ ఊరికే ఫేమస్
ఈ ఊళ్లో ‘యు’ అంటే రైస్ వైన్ బాగా దొరుకుతుంది. చాలా ఫేమస్ కూడా. ఇది ఒక డ్రింక్ మాత్రమే కాదు. ఇది వీళ్ల కల్చర్‌లో ఒక భాగం. మైతేయి కుటుంబాలు రైస్ వైన్ తయారుచేస్తాయి. అలాగే మణిపూర్‌లో ఉన్న ఊళ్లన్నింటికీ ఆండ్రో కొంచెం భిన్నంగా ఉంటుంది. ఈ ఊళ్లో ఉన్న చాలా షాపుల్లో ఆల్కహాల్ బాటిల్స్ అమ్ముతారు. చిన్న షాపుల్లో కూడా తాగడానికి ఒక ప్లేస్ ఉంటుంది. ఊరి శివార్లలో బార్లు ఉంటాయి. అక్కడ ఆల్కహాల్‌తోపాటు, బార్బెక్యూలు ఉంటాయి. నిజానికి మణిపూర్‌లో మద్య నిషేధాన్ని గట్టిగా అమలు చేస్తారు. కానీ ఇలాంటి కొన్ని గిరిజన ప్రాంతాల్లో వాళ్ల సంప్రదాయం అది అని నిషేధం విధించలేదు. ఇంట్లోనే తయారుచేసే రైస్ వైన్‌ను మూడు విధాలుగా చేస్తారు. అవి.. మచిన్, కలై, అసబ లేదా అతింగ్బా. మచిన్ తయారీలో ఔషధమొక్కలు కలుపుతారు. అందువల్ల అది ఆరోగ్యానికి మంచిది అంటారు. ఈ రైస్ వైన్ తాగడం వల్ల ఒబెసిటీ, మాల్ న్యూట్రిషన్, నెలసరి ఇబ్బందులు, ఇన్ ఫెర్టిలిటీ వంటివి తగ్గుతాయని ఊరి పెద్దలు చెప్తారు. అందుకే పుట్టుక దగ్గర నుంచి మరణం వరకు చేసే అన్ని రకాల కార్యక్రమాల్లో రైస్ వైన్ ఉంటుంది. అలాగే వాళ్ల దైవానికి, పూర్వీకులను స్మరిస్తూ రైస్ వైన్ పెడతారు. ఆండ్రోలో తయారుచేసిన ‘యు’ బాటిల్స్ మద్య నిషేధం ఉన్న మణిపూర్‌లో దొరుకుతాయి.
ఎలా వెళ్లాలి?
హైదరాబాద్ నుంచి ఇంపాల్కి విమానంలో వెళ్లొచ్చు. ట్రైన్లో వెళ్లాలనుకుంటే సికింద్రాబాద్ నుంచి అయితే న్యూ హాఫ్లాంగ్, వైజాగ్ నుంచి మైబాగ్కు వెళ్లాలి. అక్కడి నుంచి ఇంపాల్కి రోడ్డు మార్గంలో వెళ్లాలి. కారులో అయితే నేరుగా ఇంపాల్ వెళ్లొచ్చు. ఇంపాల్ చేరుకున్నాక ఆండ్రోకి ట్యాక్సీలో వెళ్లాలి. అక్టోబర్ నుంచి ఏప్రిల్ మధ్యలో వెళ్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. అదో అందమైన చిన్న పల్లెటూరు. పేరు ఆండ్రో. అక్కడికి వెళ్తే టైమ్ ట్రావెల్ చేసి కొన్ని వందల ఏండ్లు వెనక్కి వెళ్లామా? అనిపిస్తుంది. అక్కడి సంస్కృతి సంప్రదాయాలు, పద్ధతులు, అక్కడున్న దేవాలయం.. అన్నీ పాతకాలం నాటివే. ఈ పల్లెటూరికి చరిత్ర కూడా ఉంది. ఈ ఊళ్లో మట్టి, వెదురు కర్రలతో కట్టిన ఇండ్లు ఉంటాయి. ఈ ఊళ్లో ఎక్కువమంది సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తారు. వీళ్లు చేపలు పడతారు. వెదురు బుట్టలు అల్లుతారు. పందుల్ని పెంచుతారు.