హామీలు నెరవేర్చలే.. మళ్లీ ప్రజలను మభ్యపెడతున్రు : అందుగుల శ్రీనివాస్

కోల్​బెల్ట్, వెలుగు : గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మరోసారి లబ్ది పొందేందుకు ప్రజలను చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్​ మభ్యపెడుతున్నాడని బీజేపీ నియోజకవర్గ ఇన్​చార్జి అందుగుల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వచ్ఛతా హీ సేవా ప్రోగ్రాంలో భాగంగా ఆదివారం మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం క్యాతనపల్లి మున్సిపాలిటీలోని గద్దెరాగడిలో శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు మంత్రి కేటీఆర్​ పర్యటన విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర నాయకులను ఇక్కడి  తీసుకవస్తున్నారంటే స్థానిక ఎమ్మెల్యే సుమన్​ ఎలాంటి పనిచేయలేదని అర్థమవుతోందన్నారు.

మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్లు అసంపూర్తిగా ఉన్నాయని తెలిపారు. ఆరు వేల అప్లికేషన్లు వస్తే కేవలం 575 ఇండ్లు మాత్రమే  నిర్మించారన్నారు. వీటిని కూడా తన అనుచరులకు ఇచ్చేందుకు బాల్క సుమన్​ మంత్రి చేత ప్రారంభింపజేశారని ఆరోపించారు. చెన్నూరు పట్టణంలో ఇప్పటి వరకు ఒక ఇంటిని కూడా నిర్మించలేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి బాల్క సుమన్​ ఎలాంటి కృషి చేయలేదని చెప్పారు.

మంత్రి పర్యటన సందర్భంగా తమ పార్టీ లీడర్లు, కార్యకర్తలను ముందస్తు అరెస్టు చేయించడం ఎంతవరకు సమంజసమన్నారు. నియోజకవర్గంలో సుమన్​ ఇసుక మాఫియాను ప్రోత్సాహిస్తున్నారని, దోపిడీ, ఆరాచకాలకు అడ్డగా మార్చారని ఆరోపించారు. సింగరేణి కారుణ్య నియామకాల్లో పైరవీలు సాగుతున్నాయన్నారు.  స్థానిక యువతకు ఉపాధి కోసం లెదర్​పార్కును వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.  కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్​ అక్కల రమేశ్​ తదితరులు పాల్గొన్నారు.