- 11,069 మంది గర్భిణులను పరీక్షిస్తే 7,023 మందికి రక్తహీనత
భవిష్యత్ తరాల ఆరోగ్యంపై ఎఫెక్ట్ - అడవి బిడ్డలకు సరైన తిండి దొరకని వైనం
- వారికి అందాల్సిన పౌష్టికాహారం అక్రమార్కుల పాలు
భద్రాచలం, వెలుగు: పోషకాహార లోపం భద్రాచలం మన్యానికి శాపంగా మారింది. మన్యం మహిళల్లో 70శాతానికి పైగా రక్తహీనత వేధిస్తోంది. ఇటీవల జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ 11,069 మంది గర్భిణులను పరీక్షిస్తే 7,023 మంది ఎనీమియాతో బాధపడుతున్నట్లుగా తేలింది. పోషకాహార పంపిణీలో జరుగుతున్న అక్రమాలే సమస్యకు అసలు కారణంగా తెలుస్తోంది. జిల్లాలోని 2,060 అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ అవుతున్న రేషన్ బియ్యం, గుడ్లు, బాలామృతం , పాలు ఏమైపోతున్నాయో అర్థంకాని పరిస్థితి. అడవిబిడ్డల ఆహారం అక్రమార్కుల పరం అవుతుండగా పోషకాహార లోపంతో మన్యంవాసులు బక్కచిక్కిపోతున్నారు. ఇక్కడి చిన్నారుల్లో 60–-70 శాతం పోషకాహార లోపంతో బాధపడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. గర్భిణులు, బాలింతలు, అప్పుడే పుట్టిన నవజాత శిశువులు సైతం రక్తహీనత, నీరసంగా ఉండటం, బరువు తక్కువుండటం, ఎత్తు పెరగకపోవడం, దేహం పాలిపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో భవిష్యత్తరాల ఆరోగ్యంపై ఎఫెక్ట్ పడుతోంది. 2.5 కిలోల బరువుతో పుట్టాల్సిన శిశువులు చాలా బలహీనంగా ఉండి పురిట్లోనే కన్నుమూస్తున్నారు. రక్తం లేక ప్రసవవేదన భరించలేక తల్లులు తనువు చాలిస్తున్నారు. ఏటా 15 మంది తల్లులు చనిపోతుంటే, శిశువులు పురిట్లోనే మరణించే వారి సంఖ్య సాలీనా 200 పైచిలుకే ఉంటోంది.
రెండు సార్లు కిట్స్ పంపిణీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులకు న్యూట్రిషన్కిట్లు అందజేయనున్నారు. 13వ వారం నుంచి 27 వారాల వరకు ఒకసారి, 28 నుంచి 34 వారాల మధ్య రెండో సారి ఈ కిట్లు ఇస్తారు. ఈ కిట్లలో కిలో నెయ్యి, కిలో న్యూట్రిషన్ పౌడర్, కిలో ఎండు ఖర్జూరం, ఐరన్ ఫోలిక్ సిరప్ ఒకటి, ఒక కప్పు, ఒక చెంచా, ఇవన్నీ పెట్టుకునేందుకు ఒక బాక్సు ఉంటుంది. ఒక్కో కిట్టు రూ.2వేల విలువ చేస్తుంది. గర్భిణులకు వీటిని ఇవ్వడం ద్వారా వారితో పాటు వారికి పుట్టే బిడ్డలు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని వైద్యాధికారులు చెబుతున్నారు.
కాంట్రాక్టర్లకు మెమోలు ఇస్తున్నాం
పౌష్టికాహారం అందించే విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదు. కోడిగుడ్లు, పాలు సప్లై చేసే కాంట్రాక్టర్ల వల్ల కొంత గ్యాప్ వస్తున్న మాట వాస్తవమే. సకాలంలో అందడం లేదు. వారికి మెమోలు ఇస్తున్నాం. పీడీకి ఫిర్యాదు కూడా చేశాం. కాంట్రాక్టర్లను మార్చే ఆలోచన చేస్తున్నారు. - సలోనీ, సీడీపీవో, బూర్గంపాడు
సరైన తిండి దొరక్క...
మన్యంలోని పలు గిరిజన గ్రామాల్లో సరైన తిండి దొరకని దుస్థితి నెలకొంది. కరోనా, వరుస వరదలతో పల్లెల్లో జీవనం అస్తవ్యస్తమైంది. ఉపాధి లేదు. పనులు దొరకని పరిస్థితి. అంగన్వాడీ కేంద్రాల ద్వారా సప్లై అయ్యే కోడిగుడ్లు, నూనెలు, బాలామృతం బ్లాక్మార్కెట్లకు తరలిపోతున్నాయి. ఏళ్ల తరబడి పాలు సప్లై కావడం లేదు. దీనితో మన్యంలో గర్భిణులకు నేరుగా పోషకాహారం అందించేందుకు జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ సిద్ధమైంది.