అంగన్ వాడీ ఆయాల ఆనందం.. టెన్త్​తోనే ప్రమోషన్లకు రాష్ట్ర సర్కార్ నిర్ణయం

అంగన్ వాడీ ఆయాల ఆనందం.. టెన్త్​తోనే ప్రమోషన్లకు రాష్ట్ర సర్కార్ నిర్ణయం
  • విద్యార్హత సడలింపు ఇస్తూ  తాజాగా ఉత్తర్వులు 
  • రాష్ట్రవ్యాప్తంగా వందలాది మందికి దక్కనున్న చాన్స్ 
  • వయసు నిర్ధారణ విషయంలో అయోమయం
  • కొత్త నియామకాల కోసం ఇంటర్ మస్ట్ 

మంచిర్యాల, వెలుగు: అంగన్ వాడీల్లో ఆయాలకు, టీచర్లుగా ప్రమోషన్లలో ఇంటర్ విద్యార్హత నిబంధనను ప్రభుత్వం సడలించింది. టెన్త్ క్వాలిఫికేషన్ తోనే ప్రమోషన్లు కల్పించాలని ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఎట్టకేలకు రెండేండ్ల తమ పోరాటం ఫలించినందుకు అంగన్ వాడీ సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాష్ర్టవ్యాప్తంగా వందలాది మందికి ప్రమోషన్లు వచ్చే చాన్స్ వచ్చింది. 

కాంగ్రెస్ సర్కారు చొరవతో.. 

గతంలో అంగన్ వాడీ టీచర్ల నియామకాలకు టెన్త్ విద్యార్హత ఉండేది.  డిసెంబర్ 2022లో కేంద్ర ప్రభుత్వం ఇంటర్ విద్యార్హతను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం జనవరి, 2023లో రాష్ట్రంలో అప్పటి బీఆర్ఎస్ సర్కారు అంతకుముందున్న రూల్స్ మారుస్తూ సర్క్యులర్ రిలీజ్ చేసింది. ఈ నిబంధనను వ్యతిరేకిస్తూ అంగన్ వాడీ ఆయాలు వివిధ యూనియన్ల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. అయినా నాటి సర్కార్ పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చొరవ చూపింది. 2022, ఆగస్టు1కి ముందు ఆయాలుగా నియమితులైన వారికి టెన్త్ విద్యార్హతతో టీచర్లుగా ప్రమోషన్లకు అర్హత కల్పిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆయాలుగా పదేండ్ల సర్వీస్ ఉండి, 45 ఏండ్లలోపు వారు అర్హులుగా పేర్కొంది. తద్వారా రాష్ర్టవ్యాప్తంగా వందల మంది ఆయాలకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది.     

వయసు నిర్ధారణ సర్టిఫికెట్లు లేకపోవడంతో..

ఆయాల వయసు నిర్ధారణ విషయంలో కొంత అయోమయం నెలకొంది. అప్పట్లో నియమితులైన చాలామందికి బర్త్ సర్టిఫికెట్లు లేవు. టెన్త్ సర్టిఫికెట్లలో పుట్టిన తేదీ ఒకటి ఉంటే.. ఆధార్ కార్డుల్లో మరో రకంగా ఉంది. ఈ రెండింటి ప్రకారం 45 ఏండ్లు దాటిన కొంతమంది కూడా అఫిడవిట్లు తీసుకొచ్చి తమకూ ప్రమోషన్లు ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని తెలిసింది. దీంతో వయసు విషయంలో టెన్త్ సర్టిఫికెట్లను ప్రమాణికంగా తీసుకోవాలా? లేక ఆధార్ కార్డులను పరిగణనలోకి తీసుకోవాలా? అని ఆఫీసర్లు తర్జనభర్జన పడుతున్నారు. ఈ క్రమంలో వయసు నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని పలువురు సూచిస్తున్నారు.