- రాయకల్లో కళ్లుతిరిగి పడిపోయిన కార్యకర్తలు
- కొత్తగూడెం కలెక్టరేట్లోకి దూసుకెళ్లి ఆందోళన
- ఆరో రోజుకు చేరిన సమ్మె
నెట్ వర్క్, వెలుగు : అంగన్వాడీ టీచర్లు, వర్కర్ల ఆందోళన ఉధృతమవుతోంది. తమను పర్మినెంట్ చేయాలని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ వారు సమ్మె చేస్తున్నారు. జగిత్యాల జిల్లా రాయికల్ తహసీల్దార్ ఆఫీస్ ఎదుట సమ్మె లో పాల్గొన్న తొమ్మిది మంది అంగన్వాడీ టీచర్లు, ఆయాలు శనివారం అస్వస్థతకు గురయ్యారు. ఆరవరోజు సమ్మె చేస్తున్నక్రమంలో తొమ్మిది మంది శిబిరంలోనే సృహ తప్పి పడి పోయారు. వారిని వెంటనే అంబులెన్స్ లో రాయికల్ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి చికిత్స అందించారు.
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ టీచర్ల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. సమ్మెలో భాగంగా శనివారం కలెక్టరేట్ఎదుట ధర్నా చేస్తున్న అంగన్వాడీలు ఒక్కసారిగా కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు గేట్లు మూసేశారు. దీంతో అంగన్వాడీలు గేట్లు ఎక్కి లోపలికి దిగడంతో గేట్లను ఓపెన్ చేశారు. కలెక్టరేట్లోపల కొంత సేపు ఆందోళన చేపట్టారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత ఇంటిని ముట్టడించిన అంగన్వాడీలు ఇంటి ముందే బైఠాయించారు. ధర్నా విరమించాలని పోలీసులు కోరినా వినకపోవడంతో యూనియన్ లీడర్లు, సీఐటీయూ నాయకులను అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తమ డిమాండ్లను తీర్చకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.