మారుమూల గ్రామాల్లో అంగన్ వాడీలు కరువు

మారుమూల గ్రామాల్లో అంగన్ వాడీలు కరువు
  • అవస్థలు పడుతున్న గర్భిణులు, బాలింతలు, చిన్నారులు
  • పక్క గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు
  • మినీ అంగన్ వాడీ సెంటర్లు ఏర్పాటు చేయాలని వేడుకోలు

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలోని అడవి బిడ్డలకు పౌష్టికాహారం అందని ద్రాక్షగానే మిగులుతోంది. ఉన్న గ్రామాల్లో అంగన్ వాడీ సెంటర్లు లేక కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ అవస్థలు పడుతున్నారు. ఏజెన్సీ ఏరియాల్లో మూడు, నాలుగు గ్రామాలకు కలిపి ఒక అంగన్ వాడీ కేంద్రం ఉండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పక్కన ఉన్న గ్రామాలకు గర్భిణిలు, బాలింతలు, చిన్నపిల్లలు ప్రయాణించలేక తిప్పలు పడుతున్నారు. గుం తల రోడ్లు, వాగులు వంకలు దాటలేక నరకయాతన అనుభవిస్తున్నారు. ఎడ్లబండ్లను ఆసరాగా చేసుకుని, సరుకులు తెచ్చుకుంటున్నారు.

చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి..

జిల్లాలో ఆదిలాబాద్, బోథ్, ఉట్నూర్, జైనథ్, నార్నూర్ ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. ఈ ప్రాజెక్టుల పరిధిలో 1256 అంగన్ వాడీ సెంటర్లు పనిచేస్తున్నాయి. ఇందులో 987 ప్రధాన కేంద్రాలు, 269 మినీ సెంటర్లు ఉన్నాయి. ఆయా కేంద్రాలకు వచ్చే వారిలో చిన్నారులు దాదాపు 23వేలు, గర్భిణులు 6700, బాలింతలు 6300మంది ఉన్నారు. అయితే ఏజెన్సీ ఏరియాల్లోని అంగన్ వాడీలు కొన్ని మాత్రమే ఉండడంతో అడవి బిడ్డలకు పౌష్టికాహారం అందడం లేదు. ఫలితంగా పిల్లలు బక్కచిక్కిపోతున్నారు. గర్భిణులు రక్త హీనతకు గురవుతున్నారు. మారుమూల గ్రామాల్లో మినీ అంగన్ వాడీలు ఏర్పాటు చేస్తే గానీ సమస్య పరిష్కారం అయ్యేలా లేదు.

ధర్నాలు చేసినా..

అంగన్ వాడీ కేంద్రాలు దూరంగా ఉన్న గ్రామస్తులు గతంలో ఆఫీసర్లకు అర్జీలు పెట్టారు. మినీ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. రెండు నెలల కింద కలెక్టర్​కు సైతం విన్నవించారు. అయినా పట్టించుకోకపోవడంతో ఇటీవల కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. ఆ తర్వాత ఐసీడీఎస్ ఆఫీసర్లు మొక్కుబడిగా ఆయా గ్రామాలకు వెళ్లి సరుకులు అందజేశారు. అనంతరం పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. అధికారులు మాత్రం మినీ సెంటర్ల ఏర్పాటుకు గవర్న మెంట్ కు ప్రపోజల్స్ పంపించామని చెబుతున్నారు. అయితే గతంలో బేల, జైనథ్, నార్నూర్ మండలాల్లో ఐదు మినీ అంగన్వాడీ సెంటర్లకు ప్రపోజల్స్ పంపినా నేటికీ సర్కారు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. జిల్లా వ్యాప్తంగా పౌష్టికాహారం అందని గ్రామాలు వందకు పైగానే ఉంటాయి.

పర్యవేక్షణ కరువు..

మారుమూల గ్రామాల బాధితులకు పౌష్టికాహారం అందుతుందో లేదో కూడా ఆఫీసర్లు పర్యవేక్షణ చేయడం లేదు. నెలా వారీగా సరుకులు తీసుకుంటున్నారా? ఎంతమంది వస్తున్నారనే విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు. ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదు. రోడ్లు అధ్వానంగా ఉండడం, వాగులపై వంతెనలు లేకపోవడంతో వాళ్లు కూడా రాలేకపోతున్నారు. ఇకనైనా ప్రభుత్వం దృష్టిసారించి మినీ అంగన్ వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. రోడ్లు బాగు చేసి, వంతెనలు నిర్మించి రవాణా సౌకర్యం కల్పించాలని వేడుకుంటున్నారు.

ఎడ్లబండ్లపై అంగన్ వాడీ కేంద్రానికి వెళ్తున్న ఈ లబ్ధిదారులు.. బేల మండలంలోని మల్కుగూడ, వడగూడ, విష్ణుగూడకు గ్రామస్తులు. ఈ గ్రామాలు ‘బాధి’ పంచాయతీ పరిధిలోకి వస్తున్నా.. ఇది దూరం కావడంతో పక్కన ఉన్న ‘హేటి’ గ్రామానికి వెళ్తున్నారు. దాదాపు మూడు కిలోమీటర్లు గుంతల రోడ్లపై వెళ్తూ అంగన్ వాడీకి చేరుకుంటు న్నారు. ఇకవానలు పడితే రాకపోకలు బంద్. ఏండ్లుగా ఇదే పరిస్థితి ఉన్నా.. ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. ఈ ఒక్క గ్రామమే కాదు జిల్లాలోని చాలా గ్రామాలు అంగన్ వాడీ కేంద్రాలకు దూరంగా ఉన్నాయి.

మినీ సెంటర్ ఏర్పాటు చేయాలి

మా గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం లేదు. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘ఏటి’ గ్రామానికి వెళ్తున్నాం. ఆ ఊరుకు సరైన రోడ్డు లేదు. దీనివల్ల గర్భిణులు, బాలింతలు, చిన్నారులు అక్కడికి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. పౌష్టికాహారం సరైన సమయానికి అందడం లేదు. మినీ అంగన్ వాడీ కేంద్రం ఏర్పాటు చేస్తే సమస్య తీరుతుంది.  

- మమత, వడగూడ 

ప్రపోజల్స్ పంపాం..

జీపీలకు అనుబంధంగా ఉన్న గ్రామాల్లో మినీ అంగన్ వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికే మినీ అంగన్ వాడీ కేంద్రాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. అంగన్ వాడీ కేంద్రాలు లేని గ్రామాల్లో లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకుంటాం.

- మిల్కా, ఐసీడీఎస్ పీడీ