నెట్‌వర్క్, వెలుగు : ఉమ్మడి జిల్లాలో గురువారం సమ్మెలు, ధర్నాలు, రాస్తారోకోలు జరిగాయి. తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని కొందరు, పెండింగ్ బిల్లులు చెల్లించాలని మరికొందరు ఆందోళన బాటపట్టారు. ఎస్ఎస్ఏ, అంగన్‌వాడీ సిబ్బంది, మిడ్డే మీల్స్కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరసన తెలిపారు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట తమ ఉద్యోగాలు రెగ్యులర్ చేయాలని ఎస్ఎస్‌ఏ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సంఘీభావం తెలిపారు.
ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి రాగానే ఎస్ఎస్‌ఏ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. వీరితోపాటు అంగన్‌వాడీ ఉద్యోగులు కలెక్టరేట్ నుంచి ర్యాలీగా వెళ్లి జిల్లా సంక్షేమ అధికారి ఆఫీస్‌ను ముట్టడించారు. గోదావరిఖనిలోని యూనివర్సిటీ పీజీ కాలేజీ ఆవరణలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్లకార్డులతో నిరసన తెలిపారు. జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లోని కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులర్‌చేసి, తమను పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సిరిసిల్లలో అంగన్‌వాడీ సిబ్బంది 4 రోజులుగా సమ్మె చేస్తున్నారు.