పౌష్టికాహారానికి బకాయిల భారం..కామారెడ్డి జిల్లాలో రూ.53 లక్షల పెండింగ్​

పౌష్టికాహారానికి బకాయిల భారం..కామారెడ్డి జిల్లాలో రూ.53 లక్షల పెండింగ్​
  • 4 నెలలుగా పెండింగ్​లో అంగన్​వాడీ సెంటర్ల బిల్లులు  
  • అప్పులు చేసి నిర్వహిస్తున్న టీచర్లు
  • బకాయిలు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తులు 

కామారెడ్డి, వెలుగు : చిన్నారులు, గర్మిణులు, బాలింతల ఆరోగ్యం కోసం అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ సెంటర్ల ద్వారా ప్రభుత్వం పౌష్టికాహారం అందజేస్తోంది. పౌష్టికాహారం అందించేందుకు కావలసిన వస్తువులు ముందుగా అంగన్​వాడీ టీచర్లే కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం నెలకోసారి బిల్లులు మంజూరు చేస్తుంది. అయితే బిల్లులు నెలనెలా ఇవ్వకపోవంతో  అప్పులు చేసి పౌష్టికాహారాన్ని అందించాల్సి వస్తోంది.  కామారెడ్డి జిల్లాలో రూ. 53 లక్షలకు పైగా బకాయిలు ఉన్నాయి.  ఆగస్టు నుంచి  కూరగాయలు,  గ్యాస్ బిల్లులు రావాల్సి ఉంది.  జిల్లాలో ఐదు సెక్టార్ల పరిధిలో 1,193 అంగన్​వాడీ సెంటర్లు ఉన్నాయి.  

వీటిల్లో 6 నెలలు వయస్సున్న చిన్నారులు  31,479 మంది,  7 నెలల నుంచి 3 ఏండ్ల మధ్య ఉన్నవారు 18,407,   3 నుంచి 6 ఏండ్ల మధ్య  61,897 మంది ఉన్నారు.   గర్భిణులు  6,498 మంది,  బాలింతలు 5,513 మంది ఉన్నారు. వీరికి ప్రతిరోజూ అంగన్ వాడీ సెంటర్లలో  పౌష్టికాహారం అందిస్తారు.  పౌష్టికాహారానికి అవసరమైన బియ్యం, పప్పు, నూనె, గుడ్లు, ఇతర వస్తువులు ప్రభుత్వం నేరుగా  సప్లయ్​ చేస్తోంది.   

పెండింగ్​లో కూరగాయలు, గ్యాస్​ బిల్లులు

చిన్నారులు, బాలింతలు, గర్బిణులకు పోషకాలతో కూడిన భోజనం వడ్డించాలి.  ఆకుకూరలు, ఇతర కూరగాయలు  స్థానికంగా అంగన్​వాడీ టీచర్లు కొనుగోలు చేయాలి. ఆ సెంటర్లలో నమోదైన  సంఖ్య మేరకు ప్రతి రోజు ఇవ్వాల్సిన పరిమాణం ప్రకారం  ఇవ్వాలి. అలాగే సెంటర్లలో పనిచేసేవారికి  పనిచేసిన రోజుల ప్రకారం చెల్లింపులు ఉంటాయి.  జిల్లాలో 0 నుంచి 6 ఏండ్ల మధ్య 1,11,783 మంది చిన్నారులు, గర్మిణులు, బాలింతలు  12,011 మంది నమోదై ఉన్నారు.   వీరికి సగటున ప్రతినెల కూరగాయలకు  రూ.9,19,643,  గ్యాస్​కు రూ.4,09,999 ఖర్చు కానుంది.  

ఈ లెక్కన నెలకు రూ.13.29 లక్షల వరకు ఖర్చవుతుంది.  ఆగస్టు నుంచి బిల్లులు పెండింగ్​లో ఉన్నాయి.  ప్రతీ సెంటర్​లో  25 నుంచి 50 మంది ఉంటారు.   ఒక్కో సెంటర్​కు నెలకు రూ.2 నుంచి 3 వేల వరకు ఖర్చు ఉంటుంది. బిల్లులు చెల్లించకపోవడంతో మొత్తం బకాయి రూ. 53 లక్షల వరకు ఉంది.   ప్రభుత్వం ప్రతీనెల బిల్లులు చెల్లించకపోవడంతో టీచర్లు నానా అవస్థలుపడుతున్నారు. ఏ నెల బిల్లు ఆనెల చెల్లిస్తే పౌష్టికాహారం అందించేందుకు ఎలాంటి తమకు ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు. ఉన్నతాధికారులు చొరవ చూపి బిల్లుల బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతున్నారు. 

బకాయిలపై ఉన్నతాధికారులకు నివేదించాం

పౌష్టికాహారానికి సంబంధించి అంగన్​వాడీ టీచర్లకు  చెల్లించాల్సిన బకాయిల వివరాల నివేదికను ఉన్నతాధికారులకు అందజేశాం.  బిల్లులు త్వరలో వస్తాయి. బిల్లులు  సెక్టార్ల వారీగా చెల్లిస్తాం.  సెంటర్లలో పౌష్టికాహారం ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం.

- ప్రమీల, జిల్లా ఐసీడీఎస్​ అధికారి