- 2 నెలలుగా నిలిచిన సప్లయ్
- కొన్ని సెంటర్లలో స్థానికంగా సర్దుబాటు
- కామారెడ్డి జిల్లాలో ప్రతీసారి ఇదే పరిస్థితి
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలోని అంగన్వాడీ సెంటర్లలో కంది పప్పు స్టాక్లేదు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం కోసం అవసరమైన సరకుల సప్లయ్సైతం సక్రమంగా జరగడం లేదు. పప్పు లేకుండానే కూర వండడం, చారు చేస్తుండడంతో చిన్నారులు తినడానికి ఆసక్తి చూపడం లేదు. జిల్లాలోని కొన్ని సెంటర్లలో పూర్తిస్థాయిలో పప్పు లేకపోగా, కొన్ని చోట్ల సమీపంలో స్టాక్ఉన్న సెంటర్ల నుంచి సర్దుబాటు చేసుకుంటున్నారు. జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, దోమకొండ, మద్నూర్ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,193 అంగన్వాడీ సెంటర్లున్నాయి. 53,082 మంది చిన్నారులు, 6,871 మంది గర్భిణులు, 6,998 మంది బాలింతలు ఉన్నారు.
3 నుంచి 5 మధ్య ఏళ్ల వయసున్న పిల్లలు, గర్భిణులు, బాలింతలకు సెంటర్లలో పౌష్టికాహారమివ్వాలి. ఇందుకోసం బియ్యం, కందిపప్పు, నూనె, బాలామృతం, మురుకులు, పాలు సప్లయ్చేస్తారు. కందిపప్పు 3 నుంచి 5 ఏండ్ల లోపు పిల్లలకు ఒక్కోక్కరికి రోజుకు 15 గ్రాములు, గర్భిణులు, బాలింతలకు 30 గ్రాముల చొప్పున ఇవ్వాలి. ఈ లెక్కన యాప్‌లో సంబంధిత సెంటర్ టీచర్ నెలాఖరున తమ వద్ద ఉన్న స్టాక్, కావాల్సిన ఇండెంట్ఎంట్రీ చేయలి. సూపర్వైజర్ వాటిని పరిశీలించి, సీడీపీవోల ద్వారా స్టేట్‌కు ఇండెంట్ కోసం పంపిస్తారు.
ఇదీ పరిస్థితి..
కొన్ని నెలలుగా సెంటర్లకు కందిపప్పు సక్రమంగా సప్లయ్ కావడం లేదు. రేట్ పెరగడం, టెండర్ల ప్రక్రియలో గందరగోళం లాంటివి సప్లయ్‌పై ప్రభావం చూపుతున్నాయి. స్టేట్ లోని అన్ని సెంటర్లకు హాకా ద్వారా కంది పప్పు సప్లయ్ చేస్తున్నారు. ఏడాది నుంచి సమస్య తలెత్తుతోంది. అయినా ఉన్నతాధికారులు తగిన చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో కంది పప్పు సప్లయ్ చేశారు. మే, జూన్ నెలలకు సంబంధించి సరుకు సప్లయ్ కాలేదు. జూన్‌నెల ఫస్ట్‌వీక్‌లో స్టాక్పూర్తిగా కంప్లీట్అయిన సెంటర్లకు సమీపంలోని సెంటర్ల నుంచి 5 నుంచి 10 కిలోలు సర్దుబాటు చేశారు. స్టాక్వస్తుందనే ఉద్దేశంతో స్థానికంగా సర్దుబాటు చేసినా, నెల రోజులవుతున్నా హైదరాబాద్‌నుంచి సెంటర్లకు కంది పప్పు సప్లయ్ కాలేదు.
జిల్లాలోని 70 శాతం సెంటర్లలో కందిపప్పు స్టాక్ లేదు. కామారెడ్డి టౌన్‌తో పాటు, కామారెడ్డి, భిక్కనూరు, ఎల్లారెడ్డి, నిజాంసాగర్, బిచ్కుంద, మద్నూర్, మాచారెడ్డి, దోమకొండ, రాజంపేట, సదాశివనగర్మండలాల్లోని చాలా సెంటర్లలో పప్పు అందుబాటులో లేదు. కొన్ని చోట్ల 5 కిలోల కంటే తక్కువగా ఉంది. దీంతో పప్పుతో కాకుండా ఆకుకూరలు, కూరగాయలతో వండి పెడుతున్నారు. కొందరు ఉన్న పప్పును కొద్దికొద్దిగా వాడుతూ చారు కాస్తున్నారు. పప్పు లేకుండా వండితే చిన్నారులు తినడం లేదని టీచర్లు చెబుతున్నారు.
స్టాక్ రావాల్సి ఉంది
సెంటర్లకు కంది పప్పు స్టాక్రావాల్సి ఉంది. నెలాఖరున టీచర్లు యాప్‌లో ఇండెంట్ ఎంట్రీ చేయగానే, మా స్థాయిలో పరిశీలించి స్టేట్‌కు పంపుతాం. అక్కడి నుంచి స్టాక్సప్లయ్ చేస్తారు. జూన్నెలకు సంబంధించిన కంది పప్పు స్టాక్ రాలేదు. కొందరు టీచర్లు యాప్‌లో ఎంట్రీ చేయడంలో కూడా డిలే చేస్తున్నారు.
– శ్రీలత, సీడీపీవో, కామారెడ్డి