దేవరకొండ/మర్రిగూడ ( చండూరు), వెలుగు : తమ డిమాండ్ల సాధన కోసం రోజుకో రూపంలో అంగన్వాడీ ఉద్యోగులునిరసన తెలుపుతున్నారు. గురువారం 18 వ రోజు సమ్మెలో భాగంగా పట్టణంలోని డిండి చౌరస్తా వద్ద మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న అంగన్వాడీల పట్ల మంత్రి హరీశ్‌రావు అనుచిత వ్యాఖ్యాలు చేయడాన్ని ఖండించారు.
అంగన్వాడీల వేతనాన్ని నెలకు రూ.26 వేలకు పెంచి, గ్రాట్యుటీ అమలు చేయాలన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం అంగన్వాడీ టీచర్లకు రూ.10 లక్షలు, ఆయాలకు రూ.5 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మర్రిగూడలో అంగన్వాడీల సమ్మెకు తెలంగాణ ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి పాండురంగారావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలు రోజుల తరబడి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. అరెస్టులు, బెదిరింపులతో ఉద్యమాలను ఆపలేరని, వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.