అంగన్​వాడీ సేవలు మెరుగుపడాలి :  అడిషనల్​ కలెక్టర్ శ్రీజ

అంగన్​వాడీ సేవలు మెరుగుపడాలి :  అడిషనల్​ కలెక్టర్ శ్రీజ

ఖమ్మం టౌన్, వెలుగు :  జిల్లాలో ఉన్న అంగన్​వాడీ కేంద్రాలను మరింత మెరుగ్గా నిర్వహించాలని స్థానిక సంస్థల అడిషనల్​ కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ అన్నారు. గురువారం కలెక్టరేట్ లో మహిళా, శిశు దివ్యాంగుల సంక్షేమ శాఖ పనితీరుపై సంబంధిత అధికారులతో ఆమె సమీక్షించారు. జిల్లాలో సంక్షేమ శాఖ పరిధిలో తక్కువ పని తీరు ఉన్న మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అంగన్​వాడీ టీచర్ల హాజరు, పనితీరును రెగ్యులర్ గా మానిటర్ చేయాలని చెప్పారు. ప్రీ స్కూల్లో పిల్లల అటెండెన్స్ తగ్గకుండా చూసుకోవాలన్నారు.

పోషణ లోపంతో బాధపడే పిల్లలను గుర్తించి వారికి బాలామృతం ప్లస్ సరఫరా అయ్యేలా చూడాలని చెప్పారు. అంగన్​వాడీ కేంద్రాలను సకాలంలో ఓపెన్ చేయాలని, న్యూట్రిషన్, పిల్లలకు సంబంధించి వాస్తవిక పరిస్థితులు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. సెంటర్లలో కొత్తగా మంజూరు చేసిన టాయిలెట్స్, ఇతర మౌలిక వసతులు, రిపేర్లు వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి కె. రాంగోపాల్ రెడ్డి, సీడీపీవోలు, ఏసీడీపీవోలు తదితరులు పాల్గొన్నారు. 

టీజీ ఐపాస్ దరఖాస్తులు పరిష్కరించాలి

జిల్లాలో పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పించేందుకు టీజీ -ఐపాస్ కింద వచ్చిన దరఖాస్తులపై నిర్ధేశిత సమయంలో నిర్ణయం తీసుకోవాలని అడిషనల్​కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో నిర్వహించిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో పరిశ్రమల స్థాపన, టీజీ ఐపాస్, టీ- ప్రైడ్ పై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో నూతన పరిశ్రమల స్థాపనకు సంబంధించి వచ్చిన 22 ప్రతిపాదనల్లో 15 ప్రతిపాదనలకు వివిధ శాఖల వారు జారీ చేసిన అనుమతులను, తిరస్కరించిన 3 ప్రతిపాదనలను సమీక్షించారు.

పెండింగ్ లో ఉన్న 4 ప్రతిపాదనలు సైతం తక్షణమే సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. జిల్లాలో టీ - ప్రైడ్ పథకం కింద కొత్తగా ఏర్పాటు చేసిన 10 ఎస్సీ, ఎస్టీ యూనిట్లకు రూ.33,39, 282 పెట్టుబడి సబ్సిడీని మంజూరు చేసినట్లు తెలిపారు. జీఎం పరిశ్రమల శాఖ టీ.సీతారాం, లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాసరెడ్డి, జిల్లా హార్టికల్చర్ అధికారి మధుసూదన్, నాబార్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్, రైస్ మిల్లుల అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మ రాజేశ్వర రావు, అధికారులు  పాల్గొన్నారు.