
- గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ ప్రాబ్లంతో ఇబ్బందులు
- పౌష్టికాహారం వివరాలు యాప్‌లో అప్లోడ్ చేయలేని పరిస్థితి
- ఫీడింగ్ నిలిపేస్తామంటూ ఆఫీసర్ల ఒత్తిడి
- ఆందోళనకు గురవుతున్న అంగన్వాడీలు
- ఉన్నతాధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని విజ్ఞప్తి
భద్రాచలం, వెలుగు : అంగన్వాడీ టీచర్లు పోషణ్ యాప్కష్టాలతో ఇబ్బంది పడుతున్నారు. సర్కార్ ఇచ్చిన 2జీబీ ర్యామ్ ఫోన్లలో ఈ యాప్ డౌన్లోడ్ కావడం లేదు. దానికి తోడు గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. మరోవైపు పంపిణీ చేసిన పౌష్టికాహారం వివరాలు యాప్‌లో అప్లోడ్ చేయకపోతే ఫీడింగ్ నిలిపేస్తామంటూ ఆఫీసర్ల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆందోళనకు గురవుతున్న అంగన్వాడీ టీచర్లు సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
3,900 అంగన్ వాడీ కేంద్రాలు...
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 3,900 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అందులో భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 2,060, ఖమ్మం జిల్లాలో 1,840 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 6 నెలల నుంచి 3ఏళ్ల లోపు చిన్నారులు భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 35,249 మంది, ఖమ్మం జిల్లాలో 37,815 మంది ఉన్నారు. 4 నుంచి 6 ఏళ్లలోపు చిన్నారులు భద్రాద్రిలో 25,396, ఖమ్మంలో 17,998 మంది, తక్కువ బరువు ఉన్నవారు భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 4,478, ఖమ్మంలో 3,505 మంది, గర్భిణులు, బాలింతలు భద్రాద్రిలో 13,689, ఖమ్మంలో 14,353 మంది ఉన్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో 3 నుంచి 6 ఏళ్ల లోపు నమోదైన చిన్నారులకు నిత్యం 75 గ్రాముల బియ్యం, 15 గ్రాముల పప్పు, నూనె, గుడ్డు, మురుకులు, బాలామృతం అందజేస్తున్నారు. 7 నెలల నుంచి మూడేళ్ల చిన్నారులకు టేక్‌హోం రేషన్ నెలకు 2.5 కిలోల బాలామృతం, నెలకు 16 గుడ్లు(వారానికి 4) ఇస్తున్నారు. గర్భిణులు, బాలింతలకు రోజూ 150 గ్రాముల బియ్యం, 30 గ్రాముల పప్పు, 50 గ్రాముల కూరగాయలు, 16 గ్రాముల నూనె, 200 మిల్లీ లీటర్ల పాలు, ఒక గుడ్డు ఇస్తారు.
సరుకులు పక్కదారి పట్టకుండా యాప్..
అంగన్వాడీ కేంద్రంలో లబ్ధిదారులకు ఇచ్చే సరుకులు పక్కదారి పడుతున్నాయని తరుచూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో పోషణ్యాప్లో ఫేస్అథెంటికేషన్ఆప్షన్ ప్రవేశపెట్టారు. ఇందులో వారి వివరాలు నమోదు చేయాలి. ఆధార్, ఫోటో, బెనిఫిషర్ల ఫోన్ నెంబర్ నమోదు చేస్తారు. బెనిఫిషర్ ఫోన్‌కు వచ్చిన ఓటీపీని యాప్‌లో పాస్‌వర్డ్‌గా లోడ్ చేస్తే పని పూర్తవుతుంది. ఆ తర్వాత సరుకులు టేక్‌హోం రేషన్‌గా ఇస్తారు.
వేధిస్తున్న టెక్నికల్ ప్రాబ్లమ్స్..
అంగన్వాడీ టీచర్లకు నాలుగేళ్ల కింద సెల్ఫోన్లు ఇచ్చారు. ఇందులో కేవలం 2జీబీ ర్యామ్ మాత్రమే ఉంది. దీనివల్ల పోషణ్ యాప్ ఈ ఫోన్లలో డౌన్లోడ్ కావట్లేదు. గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తోంది. ఈ పరిస్థితితో చాలా మంది టీచర్లు వారి సొంత ఫోన్లలో యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు. కానీ లబ్ధిదార్ల ఫోన్లకు వారి ఆధార్‌కార్డులు లింకప్ కాకపోవడం, కేవైసీ లేకపోవడం కూడా సమస్యగా మారుతోంది.
భద్రాచలంలోని ఓ అంగన్వాడీ కేంద్రంలో 26 మంది లబ్ధిదారులు ఉంటే కేవలం 8 మందివి మాత్రమే పోషణ్ యాప్‌లో వివరాలు నమోదయ్యాయి. దుమ్ముగూడెం, చర్ల లాంటి మారుమూల గిరిజన ప్రాంతాల్లో సుమారు 30 అంగన్వాడీ కేంద్రాల్లో నెట్వర్క్ ప్రాబ్లంఉంది. లబ్ధిదారుల వివరాలను యాప్‌లో సకాలంలో అప్లోడ్ చేయకపోతే ఫీడింగ్ నిలిపేస్తామంటూ ఆఫీసర్లు హెచ్చరిస్తున్నారు. దీంతో ఆఫీసర్లు ఆందోళన చెందుతూ సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని కోరుతున్నారు.
ఒత్తిడి పెంచొద్దు... సమస్యను పరిష్కరించాలి..
ఇచ్చిన ఫోన్లు సరిగా పనిచేయడం లేదు. నాలుగేళ్ల కింద ఇచ్చిన 2జీబీ ర్యామ్ ఫోన్లలో పోషణ్ యాప్ డౌన్లోడ్ కావట్లేదు. నెట్వర్క్ ప్రాబ్లం కూడా ఉంది. వివరాలు నమోదు చేయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీచర్లను ఒత్తిడి చేయకుండా ఆఫీసర్లు సమస్యను పరిష్కరించాలి.
జిలకర పద్మ, అంగన్వాడీ టీచర్స్ యూనియన్ ( సీఐటీయూ ), జిల్లా కార్యదర్శి