![పని చేయిస్తున్రు..పైసలు ఇస్తలేరు!](https://static.v6velugu.com/uploads/2025/02/anganwadi-teachers-await-payment-for-blo-duties-in-bhadradri-kothagudem_J83j79yxi2.jpg)
- బీఎల్ఓ భృతి కోసం అంగన్వాడీ టీచర్ల ఎదురు చూపులు
- జిల్లాలో 1,095 మంది అంగన్వాడీ టీచర్లు బీఎల్వోలుగా విధులు
- అసెంబ్లీ, పార్లమెంట్ఎన్నికల టైంలోనూ అదనపు పనులు
- ఒక్కోక్కరికి రూ.4 వేల నుంచి రూ.15 వేల వరకు రావాల్సి ఉంది..
- తహసీల్దార్, మున్సిపాలిటీ ఆఫీస్‌ల ఎదుట ఆందోళనలు
- వెంటనే ఇవ్వకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఎన్నికల్లో బీఎల్వోల పాత్ర కీలకమైనది. పోలింగ్ కేంద్రాల్లో కొత్త ఓటర్ల నమోదు, ఓటరు జాబితాలో మార్పులు, చేర్పుల దరఖాస్తుల స్వీకరణ, పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాల ఏర్పాట్ల పరిశీలనతో పాటు పోలింగ్ టైంలోనూ బీఎల్వోలు డ్యూటీలు చేస్తుంటారు. బీఎల్వోలుగా అంగన్వాడీ టీచర్లే వ్యవహరిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలోనూ అంగన్వాడీల సేవలను ఆఫీసర్లు ఉపయోగించుకున్నారు. బీఎల్వోలుగా పనిచేసినందుకు, సర్వే చేసినందుకు గానూ ఇస్తామని చెప్పిన గౌరవ భృతి ఇంకా ఇవ్వలేదు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ వీరి సేవలు ఉపయోగించుకున్నారు.. కానీ పైసా ఇవ్వలేదు.
జిల్లాలో 1,095 మంది అంగన్వాడీ టీచర్లు..
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల టైంలో జిల్లా వ్యాప్తంగా 1,095 మంది అంగన్వాడీ టీచర్లు బీఎల్వోలుగా విధులు నిర్వహించారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో అంగన్వాడీ టీచర్లు పనిచేశారు. వీరితో పాటు 150 మంది వరకు ఆశా వర్కర్లు, మెప్మా సిబ్బంది, సీసీలు పనిచేశారు. అంగన్వాడీ సెంటర్లలో విధులు నిర్వహిస్తూనే ఎన్నికల విధుల్లోనూ పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటరు జాబితాలో సవరణలు, కొత్త ఓటర్ల నమోదు, మార్పులు చేర్పులతో పాటు ఎన్నికల టైంలో ఇంటింటికీ వెళ్లి ఓటరు గుర్తింపు చీటీలు పంచడం, పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాల ఏర్పాట్లు చేయడం లాంటి పనులు చేస్తుంటారు.
దీనికి ఇస్తామన్న గౌరవ భృతి మాత్రం ఇవ్వడం లేదని అంగన్వాడీ టీచర్లు పేర్కొంటున్నారు. బీఎల్వోలుగా పనిచేసినందుకు గానూ ఏడాదికి రూ. 18వేలు ఇస్తామని గతంలో ఆఫీసర్లు చెప్పారని, ఆ తర్వాత మాట మార్చి మూడు క్వార్టర్లకు గానూ రూ. 4,500 ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ రూపాయి కూడా ఇవ్వలేదంటూ వారు వాపోతున్నారు. ఇది కాకుండా కొత్తగా వచ్చిన ఓటరు గుర్తింపు కార్డులను పంపిణీ చేసినందుకు గానూ కార్డుకు రూపాయి చొప్పున ఇస్తామని, సమగ్ర కుటుంబసర్వే చేసినందుకు గానూ రూ. 10వేలు ఇస్తామని ఆఫీసర్లు చెప్పి ఇంకా ఇవ్వలేదు.
వీళ్లతో పాటు ఎన్నికలు, సర్వేలో పాల్గొన్న ఆశా వర్కర్స్, మెప్మా సిబ్బందికి కూడా కొంత మొత్తం ఇవ్వాల్సి ఉండగా అవి కూడా పైసా ఇవ్వలేదు. ఈ విషయమై ఇప్పటికే కొత్తగూడెం తహసీల్దార్, మున్సిపాలిటీ ఆఫీస్‌ల ఎదుట అంగన్వాడీ టీచర్లు ఆందోళన చేశారు. దీనిపై కలెక్టర్ స్పందించి తమకు రావాల్సిన గౌరవభృతిని వెంటనే ఇప్పించాలని వారు కోరుతున్నారు. లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
బీఎల్వోల డబ్బులు ఇవ్వాలి
బీఎల్వో డ్యూటీలు చేసిన అంగన్వాడీ టీచర్లకు ఆఫీసర్లు చెప్పిన విధంగా డబ్బులివ్వాలి. అన్ని రకాలుగా కలిపి ఒక్కో అంగన్వాడీ టీచర్‌కు రూ. 4వేల నుంచి రూ. 15వేల వరకు రావాల్సి ఉంది. సర్వే చేసిన వారికి ఇస్తామని చెప్పిన డబ్బులు ఇవ్వాలి. లేకపోతే ఆందోళనలు చేస్తాం. - మణి, అంగన్వాడీ టీచర్, కొత్తగూడెం
ఫండ్స్ రాగానే చెల్లిస్తాం..
బీఎల్వోలుగా పనిచేసిన అంగన్వాడీ టీచర్లకు డబ్బులు ఇవ్వాల్సిన మాట వాస్తవమే. ప్రభుత్వం నుంచి ఫండ్స్ రావాల్సి ఉంది. త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాగానే చెల్లిస్తాం. అంగన్వాడీ టీచర్లు ఆందోళన చెందవద్దు. పుల్లయ్య తహసీల్దార్, కొత్తగూడెం