![అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి: రవికుమార్](https://static.v6velugu.com/uploads/2023/09/Anganwadi-Teachers-Holds-Rally-Against-Govt-Over-ICDS-Privatization_ck8t2P36BF.jpg)
మహేశ్వరం/మేడిపల్లి, వెలుగు: అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు రవికుమార్ డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలంటూ మహేశ్వరం మండల కేంద్రంలో అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా సోమవారం ర్యాలీ, మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ.. ఐసీడీఎస్‌లో ఏండ్లుగా పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు కనీస వేతనం లేదన్నారు.
వారికి పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కార్యక్రమంలో మహేశ్వరం, కందుకూర్, శంషాబాద్ మండలాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు. మేడిపల్లి మండలంలోనూ అంగన్వాడీలు ఆందోళన చేపట్టగా.. పోలీసులు వారిని అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలోనూ అంగన్వాడీలు నిరవధిక సమ్మెకు దిగారు. సమస్యలు పరిష్కారం అయ్యేదాకా సమ్మె కొనసాగుతుందని తెలిపారు.