జీతాలు 18 వేలకు పెంచాలి.. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ డిమాండ్

ముషీరాబాద్, వెలుగు: అంగన్వాడీ టీచర్స్, హెల్పర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలను రూ.18 వేలకు పెంచాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) డిమాండ్ చేసింది. గురువారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద దాదాపు 2 వేల మంది అంగన్వాడీలతో ధర్నా నిర్వహించింది. ధర్నాలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.ఈశ్వర్ రావు, అధ్యక్షురాలు కె సునీత, ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి పాల్గొని మాట్లాడారు. 

అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యల పరిష్కరించాలంటూ 2023 సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 4 వరకు 24 రోజులు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె నిర్వహించామని గుర్తుచేశారు. సమ్మె కాలానికి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వేతనం రూ.18 వేలకు పెంచాలని, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, 7 నెలల బకాయిలు చెల్లించాలని కోరారు. సంక్షేమ పథకాలనూ అమలు చేయాలన్నారు. ఆరోగ్యలక్ష్మి మెనూ చార్జ్ పిల్లలకు రూ.1.15 నుంచి రూ.5కు, బాలింతలకు రూ.2.40 నుంచి రూ.10కి పెంచాలని, అన్ని కేంద్రాలకు డబుల్ సిలిండర్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

సమస్యలు పరిష్కరిస్తం: మంత్రి సీతక్క హామీ
అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. కనీస వేతనం రూ.18వేలకు పెంచాలని, పీఎఫ్, ఈఎస్ఐ, రిటైర్ మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని కోరుతూ ఇందిరాపార్కు దగ్గర ఆందోళన చేపట్టిన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లను పోలీసులు సెక్రటేరియెట్​లో మంత్రి సీతక్క దగ్గరకు తీసుకొచ్చారు. పీఎఫ్, ఈఎస్ఐ  రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచుతూ కొత్త జీవో త్వరలో ఇస్తామని మంత్రి వారితో చెప్పారు. మినీ అంగన్వాడీల నుంచి మెయిన్ అంగన్వాడీల టీచర్లు అయినవారికి 7 నెలల బకాయిలు వేతనాలు చెల్లించాలని ప్రతినిధులు మంత్రిని కోరారు.