ఆసిఫాబాద్ జిల్లాలో వర్షంలోనూ అంగన్వాడీల ఆందోళన

ఆసిఫాబాద్, వెలుగు : ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద గురువారం అంగన్వాడీ ల ఆందోళన చేపట్టారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్దకు ర్యాలీగా చేరుకోగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో వారి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురు అంగన్వాడీలు గాయపడ్డట్లు సమాచారం.

దీంతో పలువురు కలెక్టరేట్ గేటుపై నుండి దూకి, కలెక్టరేట్ ముట్టడికి ప్రయతించడంతో భారీగా చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు.ఈ తోపులాటలో ఓ అంగన్వాడీ కార్యకర్తకు పిట్స్ వచ్చి మూర్చపోయింది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు.

సమస్యలు పరిష్కారించాలని కలెక్టరేట్​లో ఐసీడీఎస్ పీడీ సావిత్రికి వినతిపత్రం అందజేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని 16 రోజులుగా సమ్మె చేస్తున్నా గవర్నమెంట్ పట్టించుకోవడం లేదని, సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.