- సొంత బిల్డింగ్‌లకు రిపేర్లు
- డ్రింకింగ్ వాటర్ కనెక్షన్లతోపాటు టాయిలెట్స్ ఏర్పాటు
- యాదాద్రికి రూ. 98.13 లక్షలు
- సూర్యాపేటకు రూ. 58.82 లక్షలు
అంగన్వాడీలను ఫ్రీ ఫ్రైమరీ స్కూల్స్‌గా మార్చేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా వీటిని మరింత బలోపేతం చేయనుంది. ఇప్పటికే అంగన్వాడీ టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా పిల్లలకు ఏ నెలలో ఏం బోధించాలో సూచిస్తూ రెండు రకాల బుక్స్‌తోపాటు యూనిఫామ్స్అందజేస్తోంది. తాజాగా పలు సెంటర్లను గుర్తించి వాటిలో సౌలత్‌ల ఏర్పాటుకు ఫండ్స్ రిలీజ్ చేసింది.
యాదాద్రి, సూర్యాపేట, వెలుగు ; అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లను నియమించి పిల్లలు మూడో తరగతి వరకూ అక్కడే చదివే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఫ్రీ ప్రైమరీ స్కూల్స్‌గా రూపుదిద్దుకోనున్న చాలా అంగన్వాడీలకు సొంత బిల్డింగ్లు లేవు. ఉన్న వాటిల్లోనూ సరైన సౌలత్లు లేవు. దీంతో ముందుగా సొంత బిల్డింగ్‌ల్లో సౌలత్లు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగా ఆయా బిల్డింగ్‌లకు మరమ్మత్తులు చేయించి వాటికి కలర్స్ వేయించనుంది. కిచెన్ రూమ్స్‌కు గాలి, వెలుతురు బాగా వచ్చే విధంగా కిటికీలు, ఇనుప జాలీలు ఏర్పాటు చేయనుంది. అలాగే మిషన్ భగీరథ నుంచి డ్రింకింగ్ వాటర్ కనెక్షన్లు, టాయిలెట్లు నిర్మించనుంది. మరోవైపు గవర్నమెంట్ స్కూల్స్ఆవరణలో ఉన్న వాటిని మోడల్ అంగన్వాడీలుగా గుర్తించి ఫర్నీచర్ అందజేస్తోంది.
యాదాద్రికి రూ. 98.13 లక్షలు
యాదాద్రి జిల్లాలోని భువనగిరి, ఆలేరు, రామన్నపేట, మోత్కూరు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 901 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. వీటిలో 234 సొంత బిల్డింగ్‌ల్లో నిర్వహిస్తుండగా, 423 సెంటర్లు అద్దె లేకుండా సమకూర్చిన బిల్డింగ్‌లో నిర్వహిస్తున్నారు. వీటిలో 114 సెంటర్లు ప్రభుత్వ పాఠశాలల పరిధిలో నడుస్తున్నాయి. మరో 244 సెంటర్లు అద్దె బిల్డింగ్‌లో నిర్వహణ సాగుతోంది. వీటి ద్వారా 5,024 మంది గర్భిణీలు, 4,392 మంది బాలింతలతో పాటు 36,084 మంది చిన్నారులు ప్రయోజనం పొందుతున్నారు. కాగా, సొంత బిల్డింగ్‌ల్లో కొనసాగుతున్న జిల్లాలోని సెంటర్లలో సౌలత్లు కల్పించేందుకు ప్రభుత్వం రూ. 98.13 లక్షలను విడుదల చేసింది. ఈ నిధులతో 200 సెంటర్లలో టాయిలెట్స్ నిర్మాణం, 50 సెంటర్లలో తాగునీరు సౌలత్ కోసం మిషన్ భగీరథ ట్యాప్ కనెక్షన్లు, 7 సెంటర్లలో బిల్డింగ్‌లకు మరమ్మత్తులు చేయించాలని ప్రభుత్వం యంత్రాంగం నిర్ణయించింది.
సూర్యాపేటకు రూ. 58.84 లక్షలు
సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల, తుంగతుర్తి, హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట అర్బన్ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,209 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. వీటిలో 311 సొంత బిల్డింగ్లు ఉన్నాయి. 435 సెంటర్లు ఇతర ప్రభుత్వ బిల్డింగ్‌ల్లో అద్దె లేకుండా, మరో 463 సెంటర్లు అద్దె బిల్డింగ్‌లో నిర్వహిస్తున్నారు. వీటి పరిధిలో 28,479 మంది చిన్నారులు, 12, 797 మంది గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నారు. సొంత బిల్డింగ్‌ల్లో కొనసాగుతున్న బిల్డింగ్‌లో సౌలత్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం రూ. 58.84 లక్షలు రిలీజ్ చేసింది. ఈ మొత్తంతో 15 అంగన్వాడీ సెంటర్లను రిపేర్ చేయడంతో పాటు కలర్స్ వేయనున్నారు. 207 సెంటర్లలో టాయిలెట్ల నిర్మాణం, 40 సెంటర్లకు డ్రింకింగ్ వాటర్ కోసం ట్యాప్ కనెక్షన్ ఇవ్వనున్నారు.
ఖర్చు చేయకుంటే వాపసే
సౌలత్‌ల ఏర్పాటు కోసం ప్రభుత్వం రిలీజ్ చేసిన ఫండ్స్‌ను ఈ ఫైనాన్స్ఇయర్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే వచ్చే ఏడాది మార్చి 31లోగా బిల్డింగ్‌లను గుర్తించి పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఫండ్స్ వాపస్ వెళ్లిపోతాయి.
సెంటర్లను గుర్తిస్తున్నాం
అంగన్వాడీ సెంటర్లలో సౌలత్‌ల కోసం ఫండ్స్ రిలీజ్ అయ్యాయి. వీటితో ఏఏ సెంటర్లలో టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ కనెక్షన్లు, మరమ్మత్తులు చేపట్టాలో గుర్తిస్తున్నాం. ఈ ప్రక్రియ తర్వాత పనులను ప్రారంభిస్తాం.
- కృష్ణవేణి, యాదాద్రి జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్