కరీంనగర్, వెలుగు: జీతాల పెంపు కోసం రాష్ట్రంలో చిరుద్యోగులు వరుస గా ఆందోళన బాట పడుతున్నారు. ఏండ్ల తరబడి డిమాండ్లు పరిష్కరించకపోవడం, ఎన్నికలు సమీపిస్తుండడంతో సమ్మెకు దిగుతున్నారు. గతంలో వీఆర్ఏలు, పంచాయతీ సెక్రటరీలు సమ్మె చేసి తమ డిమాండ్లు సాధించుకోగా..ఇటీవల అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఆశా వర్కర్లు రోడ్డెక్కారు. చాలీచాలని జీతాలతో కుటుంబాలను ఎలా పోషించుకోవాలని, తమకు కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏ కలెక్టరేట్ ముందుకు వెళ్లినా వీరి టెంట్లే కనిపిస్తున్నాయి. రెండు మూడు వారాలుగా రోజుకో తీరుగా నిరసన చేపడుతున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల ఇండ్లను ముట్టడిస్తున్నారు. ఇంత చేస్తున్నా ప్రభుత్వం మాత్రం చర్చలకు పిలవడం లేదు. దీంతో అటు అంగన్ వాడీ కేంద్రాల్లో పిల్లలకు, బడుల్లో పిల్లలకు సరిగ్గా భోజనం అందడం లేదు. ప్రభుత్వం మహిళా సంఘాల ద్వారా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ వారు మొక్కుబడిగానే డ్యూటీలు చేస్తున్నారు.
పోలీసుల ఉక్కుపాదం..
రాష్ట్రంలో సుమారు 70 వేల మంది అంగన్వాడీ ఉద్యోగులు పని చేస్తున్నారు. వీళ్లలో ఎక్కువ మంది బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారే. ప్రభుత్వం ప్రస్తుతం అంగన్ వాడీ టీచర్లకు రూ.13,600, ఆయాలకు రూ.7,800 వేతనం చెల్లిస్తోంది. వీరికి చట్ట ప్రకారం కనీస వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత లేదు. తమిళనాడు, పాండిచ్చేరి, గోవా రాష్ట్రాల్లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాయి. తమిళనాడు, కర్ణాటకలో హెల్త్ కార్డులు ఇచ్చారు. పశ్చిమబెంగాల్, కేరళ, అసోం తదితర
రాష్ట్రాల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్, పండగ బోనస్, వెల్ఫేర్ బోర్డు తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారు. కర్నాటకలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లిస్తున్నారు. తెలంగాణలో మాత్రం ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదు. పేస్కేల్ లేకపోవడం, బేసిక్ వేతనం నిర్ణయించకపోవడం వల్ల అంగన్వాడీ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ క్రమంలో తమను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనాలు చెల్లించాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని అంగన్ వాడీ టీచర్లు,హెల్పర్లు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఆందోళన చేస్తున్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగారు. దీంతో ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగులగొట్టి వాటి నిర్వహణ బాధ్యతలను స్థానిక మహిళా సంఘాలకు అప్పగించింది. సమ్మెలో ఉన్న సంఘాలను కనీసం చర్చలకు పిలవడం లేదు. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లా కేంద్రాల్లో ఆందోళనకు దిగిన అంగన్ వాడీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
సమ్మెలోకి ఆశా కార్యకర్తలు..
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 28 వేల మంది ఆశా వర్కర్లు పని చేస్తున్నారు. వీరు రిజిస్టర్స్ రాయడం, సర్వేలు చేయడం, ఆన్లైన్పని చేయడం, బీపీ, షుగర్, థైరాయిడ్ తదితర అన్ని రకాల జబ్బులను గుర్తించడంలో శిక్షణ పొందారు. ప్రభుత్వం సప్లై చేస్తున్న మందులను ప్రజలకు అందజేస్తున్నారు. వీటితోపాటు గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలకు ఇతర ప్రజలకు సేవలందిస్తున్నారు. కరోనా టైంలో కరోనాను నియంత్రించడంతో పాటు కంటి వెలుగు ప్రోగ్రామ్ లో ఆశా వర్కర్లు కీలకపాత్ర పోషించారు. పారితోషికంతో పాటు పారితోషికాలు లేని అనేక అదనపు పనులను ప్రభుత్వం ఆశాలతో చేయిస్తోంది. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సబ్ సెంటర్స్, బస్తీ దవాఖానాల్లో పని చేయిస్తోంది. ఇంత పని చేస్తున్నా ఆశాలకు కేవలం రూ. 9,750 మాత్రమే పారితోషికంగా చెల్లిస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ తరుణంలో వేతనం సరిపోవడం లేదని, రూ.18 వేలు చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని ఆశాలు ఈ నెల 25 నుంచి సమ్మెలోకి వెళ్లారు.
పిల్లలకు భోజనం పెట్టే కార్మికుల పస్తులు
రాష్ట్రంలోని స్కూళ్లలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెట్టే కార్మికులు అరకొర పారితోషికంతో పస్తులుండాల్సి వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 25 వేల స్కూళ్లలో 24 లక్షల మంది స్టూడెంట్లకు 54,201 మంది కార్మికులు భోజనం వండిపెడుతున్నారు. వీరికి కేంద్రం ఇచ్చే రూ.వెయ్యి పారితోషికం మాత్రమే అందుతోంది. చాలాకాలం పోరాడిన తర్వాత 2022 మార్చి 15న సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ప్రస్తుతం పొందుతున్న వేతనంపై అదనంగా రూ.3వేలు పెంచుతున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి జీఓ నంబర్ 8 విడుదల చేశారు. కానీ, కార్మికులకు పెరిగిన జీతం ఇంతవరకు ఇవ్వలేదు. గత విద్యాసంవత్సరానికి సంబంధించి ఆరు నెలల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో కార్మికులు అప్పులు చేయాల్సి వస్తోంది. తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయాయి. ఇప్పుడున్న మెనూకే కేటాయించిన బడ్జెట్ సరిపోవడం లేదు. పైగా కొత్త మెనూ మిక్సుడ్ వెజిటబుల్ కర్రీ, వెజిటబుల్ బిర్యానీ, వారానికి మూడు కోడిగుడ్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదనంగా బడ్జెట్ కేటాయించకుండా కొత్త మెనూ సాధ్యం కాదని మధ్యాహ్న భోజన కార్మికులు వాపోతున్నారు.
ఆందోళన చేస్తే కేసులు
చిరుద్యోగులు న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తే సర్కారు కేసులు పెట్టి వేధిస్తోంది. ఇటీవల ఆదిలాబాద్, కరీంనగర్ లో అంగన్ వాడీలు శాంతియుతంగా నిరసన తెలియజేస్తే పోలీసులు దాడి చేశారు. కరీంనగర్ లో నాతోపాటు 13 మందిపై కేసులు పెట్టారు. ప్రభుత్వం న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా ఇలా ఆందోళనలను అణచివేయాలనుకోవడం సరికాదు. ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ సర్కార్ కు పతనం తప్పదు.
టేకుమల్ల సమ్మయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏఐటీయూసీ, కరీంనగర్