మంత్రి ఇంటి ముట్టడికి.. అంగన్వాడీల యత్నం

నిర్మల్, వెలుగు: తమ సమస్యలు పరిష్కరించాలని కొద్ది రోజులుగా డిమాండ్​ చేస్తున్న అంగన్వాడీలు శనివారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మన సురేశ్, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రాజమణి, ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షుడు ఎస్ఎన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి శ్రీనివాసాచారి, జిల్లా కార్యదర్శి లలిత, ఉపాధ్య క్షురాలు శైలజ తదితరుల ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉద్యోగులు సమ్మె శిబిరం నుంచి మంత్రి ఇంటి వరకు ఊరేగింపుగా వెళ్లారు. మంత్రి ఇంటి ముందు బైఠాయించి కొద్దిసేపు నిరసన తెలిపారు. దీంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మంత్రి వారితో మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీని ఇచ్చారు.

మంత్రిని అడ్డుకున్న అంగన్వాడీలు

ఆదిలాబాద్​ టౌన్: సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీలు ఆదిలాబాద్​జిల్లా కేంద్రంలోని ఐసీడీఎస్​అర్బన్​కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. డీసీఎంఎస్​నూతన కార్యాలయాన్ని ప్రారంభించడానికి వచ్చిన మంత్రి ఇంద్రకరణ్​రెడ్డిని అడ్డుకున్నారు. మంత్రి కాన్వాయ్​కు అడ్డంగా రోడ్డుపై బైటాయించారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​చేశారు. పరిష్కారం కోసం కృషి చేస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్, నాయకులు చిన్నన్న, సునీత, కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. 

బీజేపీ గెలిస్తేనే సమస్యలు పరిష్కారం

బెల్లంపల్లి రూరల్: రాష్ట్రంలో బీజేపీ అధికారంలో వస్తేనే అంగన్వాడీల సమస్యలు పరిష్కారమవుతాయని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బెల్లంపల్లి అసెంబ్లీ ఇన్​చార్జ్ కొయ్యల ఏమాజీ అన్నారు. కాసిపేట, కన్నెపల్లి  మండలాల్లో సమ్మె చేస్తున్న అంగన్వాడీల దీక్షా శిబిరాలను సందర్శించి వారికి మద్దతు తెలిపారు.  అంగన్వాడీలను పర్మనెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. బీజేపీ  జిల్లా కార్యదర్శి గోవర్దన్, కన్నెపల్లి, కాసిపేట మండలాల అధ్యక్షులు రామయ్య యాదవ్, సంపత్ తదితరులుపాల్గొన్నారు.