పర్మనెంట్​ చేస్తామని మోసం చేసిన్రు.. సర్కారుపై కాంట్రాక్ట్, ఔట్​సోర్సింగ్ ఉద్యోగుల ఆగ్రహం

పర్మనెంట్​ చేస్తామని మోసం చేసిన్రు.. సర్కారుపై కాంట్రాక్ట్, ఔట్​సోర్సింగ్ ఉద్యోగుల ఆగ్రహం
  • పర్మనెంట్​ చేస్తామని మోసం చేసిన్రు
  • సర్కారుపై కాంట్రాక్ట్, ఔట్​సోర్సింగ్ ఉద్యోగుల గుస్సా
  • జీఓ 16 అమలు చేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం
  • సమ్మెలు, పోరాటాలు చేసినా స్పందించడం లేదని 2 లక్షల మంది ఆవేదన 
  • ఎలాంటి హామీ ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన
  • కోడ్  అమల్లోకి రావడంతో ఆందోళన విరమించిన కార్మికులు, ఉద్యోగులు

మహబూబ్​నగర్, వెలుగు : తెలంగాణ వచ్చిన వెంటనే ఉద్యోగాలను పర్మనెంట్​చేస్తామని హామీ ఇచ్చిన రాష్ర్ట ప్రభుత్వం పదేండ్లు కాలయాపన చేయడంపై కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్​ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. ఇచ్చిన హామీ నెరవేర్చలేదంటూ ఉద్యమాలు, నిరసనలు, సమ్మెలకు దిగినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు. సర్కారు పట్టించుకోకపోవడం, ఎలక్షన్​ కోడ్​అమల్లోకి రావడంతో వారు సమ్మె విరమించాల్సి వచ్చింది. దీంతో బీఆర్ఎస్ సర్కారు తమను నమ్మించి నట్టేట ముంచిందని ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

ఎన్నికల హామీగానే రెగ్యులరైజేషన్

​రాష్ర్ట సాధన కోసం ఆయా శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్​ఉద్యోగులు, సిబ్బంది తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ప్రత్యేక రాష్ట్రం అవతరించగానే కాంట్రాక్టు కార్మికులు, ఉద్యోగులందరినీ పర్మినెంట్​చేస్తామని అప్పటి ఉద్యమ నేత కేసీఆర్​ వారికి హామీ ఇచ్చారు. ఆ హామీని నమ్మి వారంతా టీఆర్ఎస్​కు ఓట్లేసి గెలిపించారు. జీఓ 16 అమలు చేసి కాంట్రాక్టు​ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేస్తామని 2016లో సీఎం కేసీఆర్  చెప్పారు. 

2018 ఎన్నికల సమయంలోనూ ఇదే హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటికీ రెండుసార్లు అధికారంలోకి వచ్చినా పది శాతం మందిని కూడా పర్మనెంట్​చేయలేదు. రాష్ర్టవ్యాప్తంగా కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్​ కింద వివిధ డిపార్ట్​మెంట్లలో అసిస్టెంట్​ప్రొఫెసర్లు, లెక్చరర్లు, జూనియర్​  లెక్చరర్లు, ఒకేషనల్​ జూనియర్​లెక్చరర్లు, ఆశా కార్యకర్తలు, అంగన్​వాడీలు, ఐకేపీ వీఓఏలు (బుక్​ కీపర్స్​), ల్యాబ్​ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, డ్రైవర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సెకండ్​ ఏఎన్ఎంలు, స్కూల్​ స్వీపర్లు, మీ సేవా ఆపరేటర్లు, హాస్పిటల్  వార్డు బాయ్స్, సిస్టర్స్​ హెల్పర్స్​, స్వీపర్లు, వార్డు ఇన్​చార్జీలు, మల్టీపర్పస్​ వర్కర్లు, మున్సిపల్​ వర్కర్లు, మిషన్​  భగీరథ సిబ్బంది ఇలా దాదాపు రెండు లక్షల మందికిపైనే ఉన్నారు. కానీ, రాష్ర్ట ప్రభుత్వం మాత్రం ఇటీవల పంచాయితీ కార్యదర్శులు, కావలికార్లు, డిగ్రీ, పాలిటెక్నిక్​ కాలేజీ లెక్చరర్లను మాత్రమే పర్మినెంట్​చేసింది. మిగతా వారెవరినీ పట్టించుకోకపోవడంతో వారంతా నిరుత్సాహంలో ఉన్నారు.

ఏడాదిగా నిరసనలు, సమ్మెలు

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్​ఉద్యోగులు తమను రెగ్యులరైజ్​ చేయడంతో పాటు సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలనే డిమాండ్లతో ఏడాదిగా ఆందోళనలు చేస్తున్నారు. ఫిబ్రవరిలో రాష్ర్టంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే టాక్​ రావడంతో విడతలవారీగా నిరసనలు, సమ్మెలకు పిలుపునిచ్చారు. సీఎం, ఇతర మంత్రుల జిల్లాల పర్యటనలను అడ్డుకుంటామని హెచ్చరించడంతో వారి పర్యటనలకు ఒకరోజు ముందే కాంట్రాక్టు ఉద్యోగులను హౌస్​అరెస్టు చేయడం, అదుపులోకి తీసుకుని పీఎస్​లకు తరలించడం వంటివి ప్రభుత్వం చేసింది. 

అక్టోబర్​లో ఎప్పుడైనా ఎలక్షన్​ నోటిఫికేషన్​ వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరగడంతో సమ్మెలకు దిగారు. ‘చలో హైదరాబాద్’ కార్యక్రమం నిర్వహించి గత సోమవారం మధ్యాహ్నం వరకు ఆయా శాఖల మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. ప్రభుత్వం తమతో చర్చలు జరపాలని డిమాండ్​చేశారు. కానీ, ప్రభుత్వం స్పందించలేదు. గత నెల కొన్ని డిపార్ట్​మెంట్లకు చెందిన కార్మికులకు రిటైర్మెంట్​ బెనిఫిట్స్​ఇవ్వడంతో పాటు, బీమా అమలు చేయడం, చనిపోతే అంత్యక్రియల ఖర్చులకు రూ.10 వేల చొప్పున ఇస్తామని ప్రకటించింది. 

ఇతర డిపార్ట్​మెంట్లలో సమ్మె చేస్తున్న వారి గురించి మాట కూడా మాట్లాడలేదు. కోడ్​వచ్చే అవకాశం ఉందనే సమాచారంతో ఎలాంటి హామీలు ఇవ్వలేదు. తీరా ఈనెల 9న మధ్యాహ్నం ఎలక్షన్​ షెడ్యూల్​విడుదల కావడం, అదే రోజు మధ్యాహ్నం కోడ్​అమల్లోకి రావడంతో కార్మికులు తప్పని పరిస్థితుల్లో సమ్మె విరమించాల్సి వచ్చింది.

నెలలుగా జీతాల్లేవ్​

గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీ పర్సస్​వర్కర్లు, 104 సిబ్బందికి ఐదారు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. మరికొన్ని డిపార్ట్​మెంట్లలోనూ ఏజెన్సీలు సిబ్బందికి మూడు నెలల జీతాలు చెల్లించాల్సి ఉంది. దీంతో నెలల తరబడి జీతాలు రాక కార్మికులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్న అవసరాలకు కూడా చేతిలో డబ్బులేక అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం పండుగల సీజన్​ కావడంతో జీతాల్లేక పూటగడవని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం స్పందించి కార్మిక ఉద్యోగులకు కాంట్రాక్ట్​ ఏజెన్సీల ద్వారా కాకుండా ట్రెజరీల ద్వారా జీతాలు చెల్లించాలని వారు డిమాండ్ ​చేస్తున్నారు.

ఇక్కడ 16 వందలు.. ఏపీలో రూ.19 వేలు  

మేం సర్కారు బడుల్లో 30 ఏండ్లుగా పనిచేస్తున్నం. ఇంత వరకు మమ్మల్ని రెగ్యులరైజ్​ చేయలేదు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి మా జీతాల్లో ఒక్క రూపాయి కూడా పెరగలేదు. రూ.1600 మాత్రమే వస్తున్నయ్. పక్కనే ఉన్న ఏపీలో స్కూల్​ స్వీపర్లకు రూ.19 వేలు ఇస్తున్నరు. ఒక కుటుంబ బతకాలంటే నెలకు రూ.27 వేతం జీతం రావాలని ప్రభుత్వమే చెబుతోంది. అలాంటప్పుడు మా జీతాలు ఎందుకు పెంచట్లేదు? 

-  గట్టన్న, స్కూల్​ స్వీపర్ల సంఘం రాష్ర్ట అధ్యక్షుడు, మహబూబ్​నగర్

వర్సిటీల మీద వివక్ష  

తెలంగాణ ఉద్యమానికి యూనివర్సిటీలు కేంద్రంగా ఉన్నాయి. అలాంటి వర్సిటీలపై రాష్ర్ట ప్రభుత్వం వివక్ష చూపుతోంది. 2016లో జీఓ 16 అమలు చేస్తామని సీఎం కేసీఆర్​ప్రకటించారు. కానీ, ఇంత వరకు వర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్  అసిస్టెంట్​ప్రొఫెసర్లు, ఇతర కాంట్రాక్ట్​  సిబ్బందిని పర్మనెంట్​చేయలేదు. డీఎల్స్​, జేఎల్స్, మరికొందరిని మాత్రమే పర్మనెంట్​ చేసి మాకు అన్యాయం చేశారు.

 
-  భూమయ్య, కాంట్రాక్ట్​ అసిస్టెంట్​ ప్రొఫెసర్ల సంఘం చైర్మన్​, పాలమూరు యూనివర్సిటీ

మా బతుకులు ఆగం చేస్తున్నరు

కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్​ కార్మిక ఉద్యోగులు వెట్టిచాకిరీ చేస్తున్నరు. సమ్మె చేస్తున్నప్పుడు విచ్ఛిన్నం చేయడానికి కార్మికుల ఇండ్లకు పోలీసులను పంపి భయాందోళనకు గురిచేశారు. ఈ టర్మ్​ అయిపోయినా మాకు న్యాయం చేయలేదు. కోటి ఆశలతో తెచ్చుకున్న తెలంగాణలో మా బతుకులు ఆగమైనయ్. 


- పి.సురేశ్, తెలంగాణ కాంట్రాక్టు, ఔట్​ సోర్సింగ్  ఎంప్లాయీస్ యూనియన్ లీడర్