మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్ జడ్పీ చైర్మన్ ఆంగోత్ బిందు అధ్యక్షతన సోమవారం స్థానిక జడ్పీ హాల్‌లో జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ సాగుపై చర్చ ప్రారంభం కాగానే తొర్రూరు జడ్పీటీసీ మంగళంపల్లి శ్రీనివాస్ మాట్లాడారు. యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేయాలని ఆఫీసర్లు సూచించడం సరికాదన్నారు.
రైతులు ఇప్పటికే నార్లు పోసుకున్నందున ఎస్సారెస్పీ నీటిని యథావిధిగా విడుదల చేయాలని డిమండ్ చేశారు. ఈ మేరకు సభ్యులంతా ఏకగ్రీవ తీర్మానం చేశారు. అయితే నీటి నిల్వలు లేకపోవడం వల్ల సమస్య ఏర్పడుతోందని ఎస్సారెస్పీ ఈఈ సమ్మిరెడ్డి చెప్పడంతో ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని సూచించారు.
రైతుబంధు అమలులో జాప్యం జరుగుతోందని, అర్హులైన రైతులందరికీ రైతుబంధు విడుదల చేయాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. అనంతరం ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ మాట్లాడుతూ ఎస్సారెస్పీ నీటి విడుదలతో పాటు పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. సమావేశంలో ఎంపీ కవిత, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, జడ్పీ సీఈవో రమాదేవి పాల్గొన్నారు.