
ఇటలీలోని పాంపీని వెనక్కి నెట్టి కంబోడియాలోని అంకోర్వాట్ ప్రపంచంలో ఎనిమిదో వింతగా అవతరించింది. ఈ హిందూ దేవాలయాన్ని 12వ శతాబ్దంలో ఖైమర్ చక్రవర్తి సూర్యవర్మ–2 నిర్మించారు. ఇది మొదటగా విష్ణువు దేవాలయంగా, ఆ తర్వాత బౌద్ధ ఆలయంగా మార్చబడింది. దీన్ని యశోధరపుర అని కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని ప్రధానంగా ఇసుక రాళ్లను ఉపయోగించి నిర్మించారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయంగా గుర్తింపు పొందింది.
యెనెస్కో దీన్ని 1992లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఈ దేవాలయ గోడలపైన హిందూ, బౌద్ధ పురాణాలను తెలిపే కథలను శిల్పాలుగా మలిచారు. ఈ ఆలయం 500 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది 15 అడుగుల ఎత్తయిన గోడ, విశాలమైన కందకం ద్వారా రక్షించబడుతోంది. ఈ ఆలయం మేరు పర్వతాన్ని సూచించే ఐదు తామర ఆకారపు టవర్లను కలిగి ఉంది. దీన్ని హిందూ, బౌద్ధ పురాణాల్లో దేవతల నివాసంగా నమ్ముతారు. ఖైమర్ సామ్రాజ్యానికి రాజధాని అంకోర్ వాట్. ఖైమర్ అనే పదం నోకోర్ (రాజ్యం) సంస్కృత నగర (నగరం) నుంచి ఉద్భవించింది. ఇది కంబోడియాలోని సీమ్ రీప్ ఉత్తర ప్రావిన్స్‌లో ఉంది.