మధ్యప్రదేశ్ రేవా జిల్లాలో దారుణం జరిగింది. పెళ్లి చేసుకోమని నిలదీసినందుకు ప్రియురాలిని ఆమె ప్రియుడు విచక్షణారహితంగా కొట్టాడు. పంటపొలాల్లోకి యువతిని తీసుకెళ్లి దారుణంగా కొట్టాడు. నేలపై పడేసి తీవ్రంగా కొట్టడంతో ఆ యువతి స్పృహతప్పి పోయింది. చాలాసేపు రోడ్డు పక్కన అపస్మారక స్థితిలోపడి ఉండగా స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్న యువతిని ఆస్పత్రికి తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
మౌగంజ్ లోని ధేరా గ్రామానికి చెందిన యువకుడు..ఇతర గ్రామానికి చెందిన యువతితో ప్రేమలో ఉన్నాడు. వీరి మధ్య పెళ్లి విషయమై వాగ్వాదం జరగడంతో ప్రియురాలిని విచక్షణా రహితంగా కొట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రియురాలిని దారుణంగా కొట్టిన యువకుడిపై వైరల్ వీడియో ఆధారంగా పోలీసులు సెక్షన్ 151 కింద కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న యువతి తల్లి ఆస్పత్రికి చేరుకుంది. అయితే కూతుర్ని కొట్టిన యువకుడిపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని సమాచారం.