యాదగిరిగుట్ట, వెలుగు: బీజేపీతో కలిసి సీఎం కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీర్ల అయిలయ్య ఆరోపించారు. యాదాద్రి జిల్లా ఆత్మకూర్(ఎం) మండలం రహీంఖాన్ పేట ఉప సర్పంచ్ కర్రె పరమేశ్ ఆధ్వర్యంలో 30 మంది బీఆర్ఎస్ నాయకులు, లెవన్ స్టార్, యంగ్ స్టార్ యువజన సంఘాలకు చెందిన 100 మంది యువకులు ఆదివారం కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ రాష్ట్రంలో నిర్వహించ తలపెట్టిన సీడబ్ల్యూసీ సమావేశాలను అడ్డుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు.
ALSO READ :బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం: పువ్వాడ అజయ్
17న పరేడ్ గ్రౌండ్, తుక్కుకూడలో బహిరంగ సభ కోసం పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. ఆఖరికి ఓ హోటల్ ను బుక్ చేసుకుంటే.. యజమానికి కూడా ఫోన్ చేసి హోటల్ ఇవ్వొద్దని బెదిరించారని ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా 17న తుక్కుగూడలో బహిరంగ సభను నిర్బహిస్తామని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తండ మంగమ్మ శ్రీశైలం, పార్టీ మండల అధ్యక్షుడు యాస లక్ష్మారెడ్డి, వైస్ ఎంపీపీ పద్మపాపయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధులు తదితరులు ఉన్నారు.