- ఏ పనీ సక్కగ చేయలే..
- ‘కారు’కు ఓటేయాలని ఎట్లడగాలె
- భువనగిరి ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ లోకల్ లీడర్ల ఆవేదన
యాదాద్రి, వెలుగు: ‘ఏ పనీ సక్కగ చేయలే.. ఇంకా ఎనిమిది నెలలే ఉంది. కారు గుర్తుకు ఓటేయాలని ఎట్లడగాలే’ అని బీఆర్ఎస్ లోకల్ లీడర్లు ఆవేదన వ్యక్తం చేశారు. పనులు చేయకపోవడంతో రాబోయే ఎన్నికల్లో ఓటేయాలని అడగలేని పరిస్థితి ఉందన్నారు. ఏదో చేద్దామని రాజకీయాల్లోకి వచ్చామని, ఏం చేయలేక బాధ పడుతున్నామని చెప్పుకొచ్చారు. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం హన్మాపురంలో శుక్రవారం బీఆర్ఎస్ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు మాట్లాడారు. ఒకరిపై ఒకరు వేదిక మీదనే తమకు అడ్డం పడుతున్నారని పరస్పరం విమర్శలు చేసుకున్నారు. లీడర్ల మధ్య సమన్వయం లేదని, క్యాడర్ ఇబ్బంది పడుతోందని చెప్పారు. ప్రోగ్రాంలు చేస్తే పిలవడం లేదని కొందరు చెప్పారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిని రమ్మని ఎప్పుడు కోరినా.. వస్తానంటారని, కానీ వచ్చేవరకు నమ్మకం లేదన్నారు. కొందరు వ్యక్తులు రాకుండా అడ్డుకుంటున్నారని, వారెవరో ఎమ్మెల్యేకు కూడా తెలుసని అన్నారు. ఎమ్మెల్యే కూడా అందరినీ కలుపుకొని పోవాలని కోరారు. గ్రామాల్లో మొదలుపెట్టిన అభివృద్ధి పనులు కొన్ని మధ్యలోనే ఆగిపోయాయని, తమ వద్ద పైసలుంటే కంప్లీట్ చేసేవారమంటూ బిల్లులు వస్తలేవని పరోక్షంగా గుర్తు చేశారు.
ఎన్నికలకు ముందే పరిహారం ఇప్పించండి
ఎన్నికలు వస్తే పైసలు వస్తయో రావో అని బీఎన్ తిమ్మాపురం లీడర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఎకరా రూ. కోటి పలికే భూమిని రిజర్వాయర్ కోసం తక్కువ రేటుకే ఇచ్చినా.. ఇప్పటివరకు ఇంకా పూర్తిగా పైసలు రాలేదని చెప్పారు. ఓటు హక్కు వచ్చిన 120 మందికి పరిహారం ఇప్పించాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిని కోరారు. ఎన్నికలు దగ్గరికి వస్తున్నందున తొందరగా పైసలు ఇప్పించాలన్నారు. ఇండ్ల స్ట్రక్చర్ వ్యాల్యూ సరిగా లెక్కించలేదని, ఇచ్చే పరిహారంతో తమకు ఏం రాదన్నారు. ఎక్కువ పరిహారం ఇప్పించాలని కోరారు. ఈ సందర్భంగా రిజర్వాయర్‌లో తమకూ చేపలు పట్టుకునే హక్కుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌మండల అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, కొలుపుల అమరేందర్, నరాల నిర్మల, సుబ్బూరు బీరు మల్లయ్య, జనగాం పాండు తదితరులు ఉన్నారు.