- రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ నుంచి ఫండ్స్ తరలించినందుకే
- భారీగా నష్టపోయిన 9 లక్షల మంది షేర్‌హోల్డర్లు
న్యూఢిల్లీ : అనిల్ అంబానీకి మార్కెట్ రెగ్యులేటరీ సెబీ షాకిచ్చింది. లిస్టెడ్ కంపెనీ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ నుంచి ఫండ్స్‌ను అక్రమంగా మళ్లించడడంతో ఐదేళ్ల పాటు మార్కెట్‌లో పాల్గొనకుండా నిషేధించింది. ఆయనతో పాటు మరికొంత మందిని బ్యాన్ చేసింది. అనిల్ అంబానీకి రూ.25 కోట్ల పెనాల్టీ వేసింది. లిస్టెడ్ కంపెనీలు లేదా సెబీ రిజిస్ట్రేషన్ పొందిన కంపెనీల్లో డైరెక్టర్‌గా లేదా కీలకమైన మేనేజింగ్ పొజిషన్లలో జాయిన్ కాకుండా చేసింది. వీటికి తోడు 24 కంపెనీలపై రూ.21 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకు ఫైన్ విధించింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ ఆరు నెలల పాటు మార్కెట్‌లో పార్టిసిపేట్ చేయకుండా బ్యాన్ పెట్టింది. ఈ కంపెనీపై రూ. 6 లక్షల ఫైన్ వేసింది. ఈ అంశాలపై అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ స్పందించలేదు. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ నుంచి ఫండ్స్‌ను తప్పుడు పద్ధతిలో మళ్లించారనే ఫిర్యాదులు రావడంతో ఆర్థిక సంవత్సరం 2018–19 లో జరిగిన ట్రాన్సాక్షన్లపై సెబీ దర్యాప్తు జరిపింది. రూల్స్‌ను ఉల్లంఘించారనే కోణంలో ఈ దర్యాప్తు కొనసాగింది.
ఇల్లీగల్‌గా లోన్లు
రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌లోని కీలక పొజిషన్లలో ఉన్న అమిత్ బాప్నా, రవీంద్ర సుధల్కర్, పింకేశ్ ఆర్ షాలతో కలిసి కంపెనీ నుంచి ఫండ్స్‌ను మళ్లించడానికి అనిల్ అంబానీ పూనుకున్నారని సెబీ దర్యాప్తులో తేలింది. అనిల్ అంబానీకి చెందిన కంపెనీలకు లోన్లు ఇస్తున్నామనే ముసుగులో ఫండ్స్‌ను తరలించారు. ఇలాంటి పద్ధతులను ఆపాలని కంపెనీ బోర్డ్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ, కార్పొరేట్ లోన్లను తరచూ రివ్యూ చేస్తామని చెప్పినప్పటికీ, టాప్ మేనేజ్‌మెంట్ మాత్రం ఈ ఆదేశాలను పట్టించుకోలేదని తేలింది. అనిల్ అంబానీ నేతృత్వంలో కీలక పొజిషన్లలో పనిచేస్తున్నవారు కంపెనీ పనితీరును పట్టించుకోలేదని తెలుస్తోంది. ఇండివిడ్యువల్స్ ఈ మోసానికి పాల్పడ్డారు కాబట్టి మొత్తం కంపెనీని జవాబుదారీ చేయడం లేదని సెబీ వివరించింది.
కొన్ని కంపెనీలు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ నుంచి ఇల్లీగల్‌గా లోన్లను పొందాయని, మరికొన్ని ఫండ్స్‌ను తరలించడంలో సాయపడ్డాయని పేర్కొంది. ‘ఈ మోసపూరిత స్కీమ్‌ను నోటీస్ నెంబర్ 2 ( అనిల్ అంబానీ) నడిపించగా, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌లో కీలక పొజిషన్లలో ఉన్నవారు నిర్వహించారు. పబ్లిక్ లిస్డెడ్ కంపెనీ అయిన రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ నుంచి ఫండ్స్‌ను మళ్లించారు. అప్పుకు అర్హత లేని కంపెనీలకు లోన్లను ఇచ్చే రూపంలో ఫండ్స్ తరలించారు. ఈ లోన్లు పొందిన కంపెనీలతో అనిల్ అంబానీకి సంబంధం ఉన్నట్టు తేలింది’ అని సెబీ వివరించింది. అడాగ్ చైర్‌పర్సన్‌గా తనకున్న అధికారాన్ని వాడి సబ్సిడరీ కంపెనీ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌లో ఈ మోసపూరిత స్కీమ్ నడిపారని పేర్కొంది.
రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ షేర్లు ఢమాల్
ఆస్తులు, క్యాష్ ఫ్లోస్, సంపద, రెవెన్యూ లేని కంపెనీలకు రూ. వందల కోట్ల లోన్లను రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్, ప్రమోటర్ ఇచ్చారని సెబీ తన 222 పేజీల రిపోర్ట్‌లో పేర్కొంది. ఈ రిపోర్ట్ ప్రకారం, ఈ లోన్లు పొందిన కంపెనీలతో ప్రమోటర్‌కు సంబంధం ఉంది. ఇది అనేక అనుమానాలకు దారి తీస్తోంది. చాలా మంది బారోవర్లు లోన్లను తీర్చడంలో ఫెయిల్ అయ్యారు. దీంతో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ తన అప్పులను తీర్చలేకపోయింది. కంపెనీ పబ్లిక్ షేర్ హోల్డర్లు నష్టపోయారు. ఉదాహరణకు 2018 మార్చిలో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ షేరు రూ. 59.60 దగ్గర ట్రేడవ్వగా, 2020 మార్చి నాటికి రూ. 0.75 కి పతనమయ్యింది. ఈ టైమ్ నాటికి కంపెనీ తన రిసోర్సులు మొత్తం ఖాళీ చేసిందనే విషయం బయటపడింది.
ఇప్పటికీ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌లో తొమ్మిది లక్షల షేరు హోల్డర్లు ఉన్నారు. వీరు భారీగా నష్టపోయారు. సెబీ తాజాగా అనిల్ అంబానీతో పాటు అమిత్ బాప్నాపై రూ. 27 కోట్లు, రవీంద్ర సుధల్కర్‌పై రూ.26 కోట్లు, పింకేష్ ఆర్ షాపై రూ. 21 కోట్ల పెనాల్టీ వేసింది. వీరితో పాటు లోన్లు పొందిన రిలయన్స్ యూనికార్న్ ఎంటర్‌ప్రైజెస్, రిలయన్స్ ఎక్స్చేంజ్ నెక్స్ట్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్, రిలయన్స్ క్లీన్‌జెన్, రిలయన్స్ బిజినెస్ బ్రాడ్‌కాస్ట్ న్యూస్ హోల్డింగ్స్, రిలయన్స్ బిగ్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై రూ.25 కోట్ల చొప్పున పెనాల్టీ విధించింది.